సవాళ్లు స్వీకరించే సత్తా లేదు.. చాలెంజ్ ఎందుకు చేశారు : మంత్రులపై కేటీఆర్ ధ్వజం

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-07-02 07:28:16  IST  )

అప్పులపై చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి తొలుత సవాల్ చేశారని, ఆ సవాలును తాము స్వీకరించాక తోకముడిచారని కేటీఆర్ విమర్శించారు.

సవాళ్లు స్వీకరించే సత్తా లేదు.. చాలెంజ్ ఎందుకు చేశారు : మంత్రులపై కేటీఆర్ ధ్వజం
X

దిశ, వెబ్‌డెస్క్: అప్పులపై చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి తొలుత సవాల్ చేశారని, ఆ సవాలును తాము స్వీకరించాక తోకముడిచారని కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంలో సవాళ్లు, ప్రతిసవాళ్లతో రాజకీయం వేడెక్కిన వేళ.. తెలంగాణ భవన్ వద్ద కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. సీఎం చర్చకు స్పందించకుండా ఉన్నపుడు.. సందట్లో సడేమియాలా మంత్రి జూపల్లి కృష్ణారావు మధ్యలో దూరారన్నారు. తెలంగాణ భవన్ కు వచ్చి అప్పులపై చర్చిస్తామని అన్నారని, అందుకే ఆయన కోసం ఎదురుచూశామన్నారు. ఇప్పుడేమో గన్ పార్క్ వద్దకు రావాలంటున్నారని, అక్కడికి వెళ్లాక చార్మినార్ కు రావాలంటారేమో అని సెటైర్లు వేశారు. తెలంగాణ భవన్ కు వస్తామన్న జూపల్లి గన్ పార్క్ వద్దకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. చర్చకు రెడీ అని డైలాగులు కొట్టి పారిపోవడం కాదని, దమ్ముంటే చర్చించేందుకు రావాలన్నారు.

గన్ పార్క్ వద్దకు వెళ్తున్న హరీష్ రావు, బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయిస్తోంది ఎవరు? అని ప్రశ్నించారు. తన శాఖలో ఏం జరుగుతుందో కూడా మంత్రి జూపల్లికి తెలియదని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ పంచాయతీతో ఒక ఐఏఎస్ అధికారి రాజీనామా కూడా చేశారని, సీఎం రేవంత్ పాలన అసమర్థుడి జీవన యాత్రలా ఉందని దుయ్యబట్టారు. హైదరాబాద్ లో తాము లక్ష ఇళ్లను నిర్మించామని, కాంగ్రెస్ సర్కార్ ఒక్క ఇల్లు కట్టినా దేనికైనా రెడీగా ఉన్నామన్నారు. జూపల్లికి దమ్ముంటే గన్ పార్క్ వద్దే ఉండాలని, అక్కడే అన్నీ చర్చిద్దామన్నారు. ప్రభుత్వానికి దేనిపైనా చర్చించే దమ్ములేదన్న కేటీఆర్.. చేతకానీవాళ్లు ఎందుకు సవాల్ చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజల ముందు అన్ని వాస్తవాలను ముందుంచుతామని అనుకున్నామన్నారు. సవాళ్లను స్వీకరించే సత్తా ముఖ్యమంత్రి, మంత్రులకు లేదని మరోసారి తేలిపోయిందన్నారు. బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసి తరలించిన కంచన్ బాగ్ పీఎస్ వద్దకే వెళ్దామని, అక్కడైనా చర్చించే దమ్ముందా అని ప్రశ్నించారు. హరీష్ రావుతో పాటు అరెస్ట్ చేసిన ఇతర బీఆర్ఎస్ నేతలందరినీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

మరోవైపు సీఎం రేవంత్ కు కేటీఆర్ మరో చాలెంజ్ చేశారు. ప్రస్తుత ప్రభుత్వ అప్పులు, గురుకులాల్లో అవినీతిపై చర్చించేందుకు.. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సమావేశాల్లో స్పీకర్ తమను అడ్డుకోకుండా.. అన్నీ చర్చించనివ్వాలన్నారు.

కేటీఆర్, హరీష్ పిల్లలు.. నాతో చర్చకు కేసీఆరే రావాలి: గన్‌పార్క్ వద్ద మంత్రి జూపల్లి సవాల్

హరీష్ రావు తరలింపులో హై టెన్షన్.. పోలీసుల రూట్ మార్పులు.. వెంటాడుతున్న బీఆర్ఎస్ నేతలు!

తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత.. పోలీసుల అదుపులో హరీష్‌రావు

రాష్ట్రంలో సవాళ్ల రాజకీయం.. చర్చకు బయల్దేరిన మంత్రులు

మంత్రి అడ్లూరి చాలెంజ్.. గన్‌పార్క్‌కు బయల్దేరిన హరీష్ రావు


Next Story