రాష్ట్రంలో సవాళ్ల రాజకీయం.. చర్చకు బయల్దేరిన మంత్రులు

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-07-02 06:08:05  IST  )

రాష్ట్రంలో అధికార - ప్రతిపక్షాల మధ్య సవాళ్ల రాజకీయం నడుస్తోంది. ప్రస్తుతం ఇది రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.

రాష్ట్రంలో సవాళ్ల రాజకీయం.. చర్చకు బయల్దేరిన మంత్రులు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో అధికార - ప్రతిపక్షాల మధ్య సవాళ్ల రాజకీయం నడుస్తోంది. ప్రస్తుతం ఇది రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. గురుకులాల్లో అవినీతి జరిగిందని ఆరోపించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. అది అబద్ధమైతే దానిపై చర్చించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రులు చర్చకు రావాలని సవాల్ చేశారు. దీంతో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి, అజారుద్దీన్ లు గన్ పార్కుకు బయల్దేరారు. గురుకులాల టెండర్లలో అవినీతి ఆరోపణలు నిజమని నిరూపిస్తే.. తన పదవికి రాజీనామా చేస్తానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సవాల్ చేశారు. ఇదే అంశంపై ఉదయం 11 గంటలకు అన్ని ఆధారాలతో తాను ప్రెస్ క్లబ్ కు వస్తానని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు అక్కడికే వచ్చి చర్చిస్తారని మంత్రి అడ్లూరి స్పష్టం చేశారు. అలాగే తెలంగాణ ప్రభుత్వ అప్పులపై చర్చించేందుకు రావాలని మంత్రి జూపల్లి కృష్ణారావుకు బీఆర్ఎస్ కు చెందిన మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు సవాల్ చేశారు. చర్చకు సిద్ధమని, గత ప్రభుత్వం 8 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిందన్నది వాస్తవమని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు. ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావులు తెలంగాణ భవన్ కు చేరుకోగా.. జూపల్లి కూడా అక్కడికే బయల్దేరినట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన రెండున్నరేళ్లలోనే భారీగా అప్పులు చేసిందని బీఆర్ఎస్ ఆరోపిస్తుండగా.. గడిచిన పదేండ్లలో బీఆర్ఎస్ అత్యధిక అప్పులు చేసిందని కాంగ్రెస్ మంత్రులు ఆరోపిస్తున్నారు. తెలంగాణ విభజన నాటికి ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పులపాలు చేసింది బీఆర్ఎస్సేనని మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే ఇరు పార్టీల నేతలు - మంత్రుల మధ్య సవాళ్లు - ప్రతి సవాళ్లు జరిగాయి. దీంతో రాష్ట్ర రాజకీయం వేడెక్కింది. చర్చల్లో ఏం తేలుస్తారన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అటు తెలంగాణ భవన్, ఇటు ప్రెస్ క్లబ్ వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

మంత్రి అడ్లూరి చాలెంజ్.. గన్‌పార్క్‌కు బయల్దేరిన హరీష్ రావు

Next Story