ఏపీలో ‘VB-G RAM-G’ స్కీమ్ ప్రారంభం

by Malleboina Mahesh |

తిరుపతి జిల్లాలో ‘VB-G RAM-G’ పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, శివరాజ్ సింగ్ చౌహాన్.. కూలీలకు రోజుకు రూ.312 వేతనం!

ఏపీలో ‘VB-G RAM-G’ స్కీమ్ ప్రారంభం
X

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా ఉన్న పేద ప్రజలకు 125 రోజులు పని కల్పిస్తూ.. కేంద్ర ప్రభుత్వం ‘VB-G RAM-G’ స్కీమ్ ను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకం జులై 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ వేదికగా ఈ సరికొత్త సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘VB-G RAM-G’ స్కీమ్‌ను తిరుపతి జిల్లా ముక్కావారిపల్లె గ్రామంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గురువారం ఉమ్మడిగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా సభా ప్రాంగణం సమీపంలో సీఎం, డిప్యూటీ సీఎం, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో కలిసి మొక్కలు నాటారు. అనంతరం గ్రామీణ పారిశుద్ధ్యం, నీటి సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన స్వచ్ఛ రథాలు, మ్యాజిక్ డ్రైన్ల (ఇంకుడు గుంతల అధునాతన రూపం) పనితీరును వారు క్షుణ్ణంగా పరిశీలించారు. జల సంరక్షణకు సంబంధించి అధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫోటో గ్యాలరీ ని సందర్శించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు.

కూలీలకు పెరిగిన రోజువారీ వేతనం.. 125 రోజులకు పని దినాలు

గ్రామీణ అభివృద్ధి, ఉపాధి కల్పనే ధ్యేయంగా వచ్చిన ఈ ‘VB-G RAM-G’ పథకం వల్ల ఉపాధి హామీ కూలీలకు భారీ లబ్ధి చేకూరనుంది. ఈ పథకం కింద అర్హులైన కూలీలకు రోజువారీ వేతనాన్ని రూ. 312 గా ఖరారు చేశారు. అంతేకాకుండా, ఇప్పటివరకు ఉన్న పనిదినాలను 125 రోజులకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం పట్ల ఉపాధి కూలీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం తో కలిసి గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మార్చేందుకు ఈ పథకం ఎంతో దోహదపడుతుందని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.

Next Story