‘దిశ’ ఎఫెక్ట్.. మద్యం మత్తులో వైద్యుడి నిర్వాకం పై డీసీహెచ్ విచారణ

by Jakkula.Mamatha |

'దిశ' దిన పత్రికలో ప్రచురితమైన కథనంపై వైద్యారోగ్య శాఖ అధికారులు తక్షణమే స్పందించారు.

‘దిశ’ ఎఫెక్ట్.. మద్యం మత్తులో వైద్యుడి నిర్వాకం పై డీసీహెచ్ విచారణ
X

దిశ, హుజూరాబాద్ రూరల్: 'దిశ' దిన పత్రికలో ప్రచురితమైన కథనంపై వైద్యారోగ్య శాఖ అధికారులు తక్షణమే స్పందించారు. మద్యం మత్తులో విధులకు హాజరై రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రి రేడియాలజీ వైద్యుడు డాక్టర్ రమేష్‌కు జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి (డి.సి.హెచ్) డాక్టర్ కృష్ణ ప్రసాద్ గురువారం షోకాజ్ నోటీసు జారీ చేశారు.

​కథనమే పునాదిగా రంగంలోకి అధికారులు..

​బుధవారం నాటి 'దిశ' దినపత్రికలో "మద్యం మత్తులో వైద్యుడు.. హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రిలో రోగుల ప్రాణాలతో చెలగాటం" అనే శీర్షికతో ప్రచురితమైన ప్రత్యేక కథనం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ వార్త ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వారు తక్షణమే స్పందించారు. డీసీహెచ్ కృష్ణప్రసాద్ గురువారం హుజూరాబాద్ ఏరియా ఆస్పత్రిని స్వయంగా సందర్శించి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు.

​సిబ్బంది, రోగుల నుంచి వివరాల సేకరణ..

​గత సోమవారం రాత్రి విధుల్లో ఉన్న రేడియాలజిస్ట్ డాక్టర్ రమేష్ మద్యం సేవించి ఉన్నాడా? లేదా? అనే కోణంలో డీసీహెచ్ సుదీర్ఘంగా విచారించారు. ఆ సమయంలో డ్యూటీలో ఉన్న నర్సింగ్ సిబ్బందిని, ఇతర వైద్య సిబ్బందిని అడిగి వివరాలు సేకరించారు. అలాగే ఆ రాత్రి ఆస్పత్రిలో చికిత్స పొందిన రోగుల వివరాలు, వారికి అందిన వైద్య సేవలను కూడా ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.

​శాఖ పరమైన చర్యలు తీసుకుంటాం: డీసీహెచ్

​ఈ సందర్భంగా డీసీహెచ్ కృష్ణ ప్రసాద్ 'దిశ'తో మాట్లాడుతూ.. బాధ్యతారహితంగా వ్యవహరించిన రేడియాలజీ వైద్యుడు రమేష్‌కు వివరణ కోరుతూ షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు స్పష్టం చేశారు. ​"వైద్యుడి నుంచి సమాధానం అందిన తర్వాత పూర్తి నివేదికను జిల్లా కలెక్టర్‌కు సమర్పిస్తాం. విధుల్లో నిర్లక్ష్యం వహించినా, రోగుల ప్రాణాలతో ఆడుకున్నా సహించేది లేదు. నివేదిక ఆధారంగా సదరు వైద్యునిపై కఠిన శాఖాపరమైన చర్యలు ఉంటాయి." అని డిసిహెచ్ డాక్టర్ కృష్ణ ప్రసాద్ తెలిపారు.

Next Story