- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజీనామాకు ఇంకా సిద్ధంగానే ఉన్నా: కేసీఆర్‌కు జూపల్లి బహిరంగ సవాల్.. అప్పుల శ్వేతపత్రం విడుదల
బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల పాలన ముగిసే నాటికి తెలంగాణ రాష్ట్రంపై అప్పులు, పెండింగ్ బిల్లులు కలిపి మొత్తం రూ.8,21,651 కోట్ల ఆర్థిక భారం మిగిలిందని మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల పాలన ముగిసే నాటికి తెలంగాణ రాష్ట్రంపై అప్పులు, పెండింగ్ బిల్లులు కలిపి మొత్తం రూ.8,21,651 కోట్ల ఆర్థిక భారం మిగిలిందని మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తాము చేస్తున్న వ్యాఖ్యలు నిరాధారమని ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలకు సమాధానంగా గన్ పార్కు అమరవీరుల స్థూపం సాక్షిగా ఆయన ఈ లెక్కలను మీడియా ముందుంచారు. 2014 జూన్ 2న రాష్ట్ర ఏర్పాటు సమయంలో మొత్తం బకాయిలు రూ.90,161 కోట్లు మాత్రమే ఉండగా, 2023 డిసెంబర్ 1 నాటికి అవి భారీగా పెరిగాయని వివరించారు.
ఆయన వెల్లడించిన వివరాలు..
రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఎఫ్‌ఆర్‌బీఎం (FRBM) రుణాలు రూ.72,658 కోట్లు ఉండగా, 2023 డిసెంబర్ నాటికి అవి రూ.3,89,673 కోట్లకు చేరాయి. ప్రభుత్వ హామీతో ప్రత్యేక ప్రయోజన సంస్థలు (SPVs) తీసుకుని, ప్రభుత్వం చెల్లించాల్సిన రుణాలు రూ.11,609 కోట్ల నుంచి రూ.1,27,208 కోట్లకు పెరిగాయి. ఈ రెండు కలిపి ప్రభుత్వ ప్రత్యక్ష బాధ్యతగా ఉన్న అప్పులు రూ.84,268 కోట్ల నుంచి రూ.5,16,881 కోట్లకు చేరినట్లు తెలిపారు. ప్రభుత్వ హామీతో ఎస్‌పీవీలు తీసుకుని, వాటినే చెల్లించే రుణాలు రూ.5,893 కోట్ల నుంచి రూ.95,462 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. కార్పొరేషన్లు తీసుకున్న ప్రభుత్వేతర హామీ రుణాలు రూ.59,414 కోట్లు ఉన్నాయని తెలిపారు. దీంతో మొత్తం రాష్ట్ర అప్పులు రూ.6,71,757 కోట్లకు చేరాయని వివరించారు.
పెండింగ్ బిల్లుల భారం కూడా భారీగానే..
అప్పులతో పాటు పెండింగ్ బిల్లుల భారం కూడా భారీగానే ఉందని మంత్రి తెలిపారు. ఉద్యోగులు, మూలధన పనులు, సంక్షేమ పథకాలకు సంబంధించిన పెండింగ్ బిల్లులు రూ.40,154 కోట్లు, డిస్కంల విద్యుత్ బకాయిలు, సింగరేణి విద్యుత్ బకాయిలు, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ బకాయిలు తదితర ఇతర పెండింగ్ చెల్లింపులు రూ.1,09,740 కోట్లు ఉన్నాయని చెప్పారు. మొత్తంగా అప్పులు, పెండింగ్ బిల్లులు కలిపి రాష్ట్రంపై రూ.8,21,651 కోట్ల ఆర్థిక భారం మిగిలిందని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. కేటీఆర్.. నేను చెప్పిన లెక్కలు తప్పని.. కేసీఆర్ తో చెప్పించాలని, నా లెక్కలు తప్పని తేలితే రాజీనామాకు సిద్ధమనే మాటకు కట్టుబడి ఉన్నానని సవాల్ విసిరారు. ఈ అంశంపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని, ప్రతిపక్ష నేతలు వాస్తవాలను ప్రజల ముందుంచాలని ఆయన సవాల్ విసిరారు.






