- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూ.12 వేల కోట్ల ఎక్స్‌ప్రెస్‌వే.. రెండు నెలలకే గుంతల మయం! కేంద్రంపై కాంగ్రెస్ ఫైర్
గత ఏప్రిల్‌లో ప్రధాని నరేంద్ర మోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వే’ అప్పుడే గుంతలమయమైందని ఆరోపణలు వస్తున్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: గత ఏప్రిల్‌లో ప్రధాని నరేంద్ర మోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వే’ అప్పుడే గుంతలమయమైంది. రూ.12 వేల కోట్ల భారీ వ్యయంతో నిర్మించిన ఈ రహదారి కేవలం రెండు నెలల వ్యవధిలోనే, తొలి వర్షాలకే దెబ్బతినడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. రహదారిపై ఏర్పడిన భారీ గుంతల కారణంగా తమ వాహనాలు దెబ్బతింటున్నాయని, ప్రయాణం నరకప్రాయంగా మారిందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గుంతలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
మోడీ సర్కార్‌పై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు
ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. మోడీ ప్రభుత్వ హయాంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో భారీగా అవినీతి, నిధుల దుర్వినియోగం జరుగుతోందనడానికి ఈ ఎక్స్‌ప్రెస్‌వే ప్రత్యక్ష ఉదాహరణ అని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా విమర్శించింది. దేశవ్యాప్తంగా వంతెనలు, జాతీయ రహదారులు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల పైకప్పులు.. ఇలా అన్నీ కూలిపోతున్నాయని ఆరోపించింది. మొత్తంగా చూస్తే మోడీ ప్రభుత్వం దేశానికి, ప్రజలకు అత్యంత ప్రమాదకరంగా మారిందని కాంగ్రెస్ ధ్వజమెత్తింది.
కాగా, ఏప్రిల్ 14న (2026) ప్రధాని మోడీ ఈ 213 కిలోమీటర్ల ఆరు లైన్ల ఎకనామిక్ కారిడార్‌ను ప్రారంభించారు. ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల గుండా సాగే ఈ రహదారిని.. వన్యప్రాణులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఈ కారిడార్‌తో ప్రయాణ సమయం, ఇంధన ఖర్చు తగ్గడమే కాకుండా.. వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు కొత్త అవకాశాలు వస్తాయని ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని పేర్కొన్నారు. కానీ, ఇంత భారీ బడ్జెట్ ప్రాజెక్టు రెండు నెలలకే దెబ్బతిన్నట్లుగా కన్పిస్తున్న వీడియో.. కాంగ్రెస్ ఆరోపణలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.






