- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సమయపాలన పాటించని ప్రధానోపాధ్యాయుడిని మందలించిన సర్పంచ్.. వాగ్వాదం
విద్యా వ్యవస్థలో నాణ్యత పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్న సమయంలో కొందరు ఉపాధ్యాయుల నిర్లక్ష్య వైఖరి ప్రభుత్వ లక్ష్యాలకు విఘాతం కలిగిస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దిశ, బయ్యారం : విద్యా వ్యవస్థలో నాణ్యత పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్న సమయంలో కొందరు ఉపాధ్యాయుల నిర్లక్ష్య వైఖరి ప్రభుత్వ లక్ష్యాలకు విఘాతం కలిగిస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బయ్యారం మండలంలోని రెండేర్లగడ్డ ప్రాథమిక పాఠశాలలో గురువారం చోటుచేసుకున్న ఘటన చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. నారాయణపురం గ్రామపంచాయతీ పరిధిలోని రెండేర్లగడ్డ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లక్ష్మణ్ నాయక్ సమయపాలన పాటించడం లేదని ఆరోపిస్తూ గ్రామ సర్పంచ్ సొలం బాలకృష్ణ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలకు ఆలస్యంగా ఎందుకు వస్తున్నారని ప్రశ్నించగా, ప్రధానోపాధ్యాయుడు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాగ్వాదానికి దిగినట్లు సర్పంచ్ తెలిపారు. "మీరు ఎవరు నన్ను అడగడానికి? సర్పంచ్ అయితే ఏంటి? నీకు సమాధానం చెప్పాలా? ఏమి చేసుకుంటావో చేసుకో" అనే విధంగా ప్రధానోపాధ్యాయుడు నిర్లక్ష్యంగా మాట్లాడినట్లు సర్పంచ్ బాలకృష్ణ ఆరోపించారు. ప్రతిరోజూ ఉదయం 10 గంటలు దాటినా పాఠశాలకు రాకపోవడంతో విద్యార్థుల చదువులకు ఇబ్బందులు కలుగుతున్నాయని, సంబంధిత అధికారులతో విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
హెచ్‌ఎంపై చర్యలు తీసుకోవాలి: పీడీఎస్‌యూ
పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.గణేష్ మాట్లాడుతూ.. సమయపాలన పాటించని ప్రధానోపాధ్యాయుడిని ప్రశ్నిస్తే "ఏం చేసుకుంటారో చేసుకోండి, ఎవరికి చెప్పుకుంటారో చెప్పండి" అనే ధోరణిలో మాట్లాడడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు. మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో ఎంఈఓ, డీఈఓల పర్యవేక్షణ సరిగా లేకపోవడంతో కొందరు ఉపాధ్యాయులు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రధానోపాధ్యాయుడిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవడంతో పాటు, విద్యాశాఖ అధికారులు పాఠశాలలను క్రమం తప్పకుండా తనిఖీ చేసి సమయపాలనను కచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.






