డిండి ప్రాజెక్టు కుడికాలువకు సాగునీటి విడుదల

by Ratna Kumari |

డిండి ప్రాజెక్టు రిజర్వాయర్ నుంచి వానాకాలం పంటల సాగు కోసం కుడికాలువకు గురువారం స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ సాగునీటిని విడుదల చేశారు.

డిండి ప్రాజెక్టు కుడికాలువకు సాగునీటి విడుదల
X

దిశ, ఉప్పునుంతల : డిండి ప్రాజెక్టు రిజర్వాయర్ నుంచి వానాకాలం పంటల సాగు కోసం కుడికాలువకు గురువారం స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ సాగునీటిని విడుదల చేశారు. నీటి విడుదలతో ఆయకట్టు రైతుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, డిండి కుడికాలువ ద్వారా లతీపూర్, గువ్వలోనిపల్లి, పెనిమెల్ల గ్రామాల ఆయకట్టు రైతులకు సాగునీటి సమస్య తీరడంతో పంటల సాగుకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. అప్పటి నిజాం నవాబు పాలనలో ప్రజల అవసరాలు, సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని 1941లో రూ.41.80 లక్షల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించి, 1943లో సాగులోకి తీసుకువచ్చారని గుర్తు చేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో మిగిలిన నిధులతో బాపనకుంట, చంద్రసాగర్ వంటి రిజర్వాయర్లను కూడా నిర్మించారని తెలిపారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి ప్రతి గ్రామానికి, ప్రతి గుంటకు సాగునీరు, తాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. డిండి ప్రాజెక్టు కుడికాలువ మరమ్మతుల కోసం రూ.35 లక్షలు మంజూరు చేసి పనులు పూర్తిచేశామని, దీంతో రైతులకు మరింత ప్రయోజనం కలుగుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కర్నె లక్ష్మీనారాయణ, డీడీకట్ట మైసమ్మ ఆలయ చైర్మన్ ఎడ్ల నరేష్ యాదవ్, సీనియర్ నాయకుడు నరసింహారెడ్డి, ఆయా గ్రామాల నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Next Story