తెలంగాణ భవన్‌లో జూపల్లి కోసం ఖాళీ కుర్చీ

by Gantepaka Srikanth |

రాష్ట్ర అప్పుల లెక్కలపై మంత్రి జూపల్లి కృష్ణారావు విసిరిన సవాల్ తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠకు దారితీసింది.

తెలంగాణ భవన్‌లో జూపల్లి కోసం ఖాళీ కుర్చీ
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర అప్పుల లెక్కలపై మంత్రి జూపల్లి కృష్ణారావు విసిరిన సవాల్ తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. ఇరు పార్టీల సవాళ్లు, ప్రతిసవాళ్లతో తెలంగాణ భవన్, గన్ పార్క్ పరిసర ప్రాంతాల్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అప్పులపై చర్చ కోసం ఇవాళ బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయమైన 'తెలంగాణ భవన్'కు వస్తానని మంత్రి జూపల్లి నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు తెలంగాణ భవన్‌లో మంత్రి జూపల్లి కృష్ణారావు కోసం ప్రత్యేకంగా ఒక సీటును సిద్ధం చేశారు. దానిపై ఆయన పేరు కూడా రాసి పెట్టారు. చర్చకు జూపల్లి రావాలంటూ గులాబీ శ్రేణులు వేచి చూశాయి.

గన్ పార్క్ వద్దే మంత్రి జూపల్లి..

మరోవైపు, తెలంగాణ భవన్‌కు వెళ్లకుండా నేరుగా గన్ పార్క్ (అమరవీరుల స్తూపం) వద్దకు చేరుకున్న మంత్రి జూపల్లి కృష్ణారావు అక్కడ కొత్త డిమాండ్ వినిపించారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ముగ్గురూ ఇక్కడికే (గన్ పార్క్) చర్చకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. తాను చెప్పిన రాష్ట్ర అప్పుల లెక్కలు తప్పని నిరూపిస్తే రాజీనామా చేస్తానన్న వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని మంత్రి స్పష్టం చేశారు. మరోవైపు మంత్రి జూపల్లి గన్ పార్క్ వద్దకు వచ్చారనే సమాచారంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చర్చకు సిద్ధమయ్యారు. తెలంగాణ భవన్ నుంచి గన్ పార్క్ వరకు ఆయన నడుచుకుంటూ (ప్రాదయాత్రగా బయలుదేరారు. అయితే, ఈ ఉద్రిక్తత మరింత పెరగకుండా చూసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. తెలంగాణ భవన్ గేటు వద్దే కేటీఆర్‌తో పాటు ఇతర ముఖ్య నేతలను పోలీసులు అడ్డుకున్నారు. కేటీఆర్ పాదయాత్రను పోలీసులు నిలిపివేయడంతో ఉరుకులు, పరుగుల మధ్య తెలంగాణ భవన్ గేటు వద్ద తీవ్ర తోపులాట, ఉద్రిక్తత చోటుచేసుకున్నాయి.

Next Story