రాష్ట్రానికి రూ. 7,707 కోట్ల భారీ కేటాయింపులపై పవన్ కళ్యాణ్ హర్షం

by Malleboina Mahesh |

ఏపీలో ‘VB-G RAM-G’ స్కీమ్ ప్రారంభం.. రాష్ట్రానికి రూ.7,707 కోట్లు, పీఎంజీఎస్‌వై కింద రూ.422 కోట్లు కేటాయించిన కేంద్రం.. ప్రధాని మోదీ, శివరాజ్ చౌహాన్‌కు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు!

రాష్ట్రానికి రూ. 7,707 కోట్ల భారీ కేటాయింపులపై పవన్ కళ్యాణ్ హర్షం
X

దిశ, వెబ్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ కలలుగన్న 'వికసిత భారత్ - 2047' లక్ష్య సాధనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘VB-G RAM-G’ జాతీయ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ వేదికగా ప్రారంభించడం పట్ల ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హర్షం వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ పరిధిలోని ముక్కావారిపల్లె గ్రామం నుంచి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులతో కలిసి ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం పవన్ కళ్యాణ్ 'ఎక్స్' (X) వేదికగా స్పందించారు. మన రాష్ట్ర అభ్యర్థనను మన్నించి, ఈ భారీ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ నుంచే లాంచ్ చేసినందుకు కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ పథకం కింద ఏపీకి రికార్డు స్థాయిలో రూ. 7,707 కోట్లు, అలాగే పీఎంజీఎస్‌వై-IV (PMGSY-IV) కింద 347 కిలోమీటర్ల మేర 146 రోడ్డు పనులు, 19 వంతెనల నిర్మాణం కోసం మరో రూ. 422 కోట్లను కేంద్రం కేటాయించిందని డిప్యూటీ సీఎం వెల్లడించారు.

ఈ భారీ కేటాయింపులు కేవలం గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పన కోసమే కాదని.. ఇవి ఆంధ్రప్రదేశ్ గ్రామాల ఆకాంక్షలు, రైతుల కలలు, యువత ఉపాధి అవకాశాలకు లభించిన నూతన శక్తి అని పవన్ కళ్యాణ్ అభివర్ణించారు. రాష్ట్రంలో పారదర్శక పాలన, సమర్థవంతమైన అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వానికి ఉన్న నమ్మకానికి ఈ నిధులే నిదర్శనమన్నారు. కేంద్రం ఏపీపై ఉంచిన ఈ నమ్మకాన్ని ఒక బాధ్యతగా స్వీకరిస్తున్నామని.. మంజూరైన ప్రతి రూపాయిని నాణ్యమైన రోడ్లు, వంతెనల నిర్మాణానికి మరియు గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరచడానికి చిత్తశుద్ధితో ఖర్చు చేస్తామని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో, సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో స్వయం సమృద్ధ గ్రామాలతో కూడిన 'వికసిత ఆంధ్రప్రదేశ్' నిర్మాణానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పవన్ కళ్యాణ్ తేల్చిచెప్పారు.

Next Story