బీఎల్‌వో విధులతో అంగన్వాడీలపై భారం

by Ratna Kumari |

అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లపై ప్రభుత్వం అదనపు విధుల భారం మోపడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీఐటీయూ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా సహాయ కార్యదర్శి కె.ఉన్నికృష్ణన్, తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు జి.సునీత అన్నారు.

బీఎల్‌వో విధులతో అంగన్వాడీలపై భారం
X

దిశ, మేడ్చల్ బ్యూరో : అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లపై ప్రభుత్వం అదనపు విధుల భారం మోపడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీఐటీయూ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా సహాయ కార్యదర్శి కె.ఉన్నికృష్ణన్, తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు జి.సునీత అన్నారు. గురువారం మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్, జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి శారదకు వినతిపత్రం అందజేసి, అంగన్వాడీ సిబ్బందికి అప్పగించిన బీఎల్‌వో విధులను తగ్గించి, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా బీఎల్‌వోలుగా పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లు ప్రజాప్రతినిధులు, బీఎల్‌ఏలు, ప్రజల నుంచి తగిన సహకారం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వలస వెళ్లిన ఓటర్ల వివరాల సేకరణ, ఫారాల పంపిణీ, స్కానింగ్, ఆన్‌లైన్ నమోదు వంటి పనులతో ఉదయం నుంచి రాత్రి వరకు పనిచేయాల్సిన పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. రాజకీయ ఒత్తిళ్లు, వేధింపులు కూడా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవైపు అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, ప్రీ-స్కూల్ విద్య, చిన్నారుల పోషణ, గర్భిణులు, బాలింతలకు సేవలు అందిస్తూనే మరోవైపు పల్స్ పోలియో, వివిధ శాఖల సర్వేలు, సమావేశాలు, నివేదికల తయారీ వంటి అదనపు బాధ్యతలు అప్పగించడం వల్ల కేంద్రాల నిర్వహణపై ప్రభావం పడుతోందన్నారు. కేవలం రూ.13 వేల గౌరవ వేతనంతో అన్ని శాఖల పనులు చేయించడం అన్యాయమని విమర్శించారు. అంగన్వాడీ ఉద్యోగులకు హెల్త్ కార్డు, ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సంక్షేమ సౌకర్యాలు కల్పించాలని, వేతనాలను సకాలంలో చెల్లించాలని కోరారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కనీస గౌరవ వేతనాన్ని రూ.18 వేలకు పెంచాలని, మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న బీఎల్‌వో భత్యాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఖాళీగా ఉన్న టీచర్, ఆయా పోస్టులను భర్తీ చేసి, అంగన్వాడీ సిబ్బందిని ఐసీడీఎస్ సేవల నిర్వహణకే పరిమితం చేసి ఇతర శాఖల అదనపు విధులను తగ్గించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. చిన్నారులకు నాణ్యమైన సేవలు అందేలా అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు.

Next Story