కొండగట్టు అభివృద్ధికి కాంగ్రెస్ సర్కార్ కట్టుబడి ఉంది: టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్

by Kodari Anjali |

టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కుటుంబ సభ్యులతో కలిసి అంజన్నను దర్శించుకున్నారు.

కొండగట్టు అభివృద్ధికి కాంగ్రెస్ సర్కార్ కట్టుబడి ఉంది: టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
X

దిశ, కొండగట్టు: టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ శుక్రవారం తన కుటుంబ సభ్యులతో కలిసి జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానాన్ని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి దంపతులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు దర్శించుకునే ప్రముఖ పుణ్యక్షేత్రంగా కొండగట్టు నిలిచిందన్నారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్లుగా పనిచేస్తోందని, పేద ప్రజలకు మరింత మేలు జరిగేలా ప్రభుత్వానికి స్వామివారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సూచనల మేరకు కొండగట్టు ఆలయ అభివృద్ధికి సమగ్ర మాస్టర్ ప్లాన్‌ను అమలు చేస్తామని మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. ఆలయ అభివృద్ధికి అవసరమైన నిధులను ప్రభుత్వం సమకూర్చే దిశగా చర్యలు తీసుకుంటోందని, అభివృద్ధి ప్రణాళికను త్వరలోనే ఆచరణలోకి తీసుకువస్తామని వెల్లడించారు. కొండగట్టును ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, సంజయ్ కుమార్, జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ సమీండ్ల వాణి, జగిత్యాల పార్టీ అధ్యక్షుడు గాజంగి నందయ్య, అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Next Story