ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకొని మహిళ ప్రాణాలను కాపాడిన ఏఎస్ఐ-కానిస్టేబుల్‌కు నగదు రివార్డు ప్రకటింపు

by Kodari Anjali |

విధి నిర్వహణలో అప్రమత్తత, వేగవంతమైన స్పందనతో ఓ మహిళ ప్రాణాలను కాపాడిన ఏఎస్ఐ, కానిస్టేబుల్ లను రాష్ట్ర పోలీసు శాఖ అత్యున్నత స్థాయిలో గుర్తించింది.

ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకొని మహిళ ప్రాణాలను కాపాడిన ఏఎస్ఐ-కానిస్టేబుల్‌కు నగదు రివార్డు ప్రకటింపు
X

దిశ, మెట్‌పల్లి: విధి నిర్వహణలో అప్రమత్తత, వేగవంతమైన స్పందనతో ఓ మహిళ ప్రాణాలను కాపాడిన మెట్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు చెందిన ఏఎస్ఐ అన్వర్ బేగ్ మరియు కానిస్టేబుల్ ప్రసాద్ సేవలను రాష్ట్ర పోలీసు శాఖ అత్యున్నత స్థాయిలో గుర్తించింది. ఈ సందర్భంగా శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) ఏఎస్సై అన్వర్ బేగ్, కానిస్టేబుల్ ప్రసాద్‌లకు ప్రత్యేకంగా అభినందిస్తూ నగదు రివార్డును ప్రకటించారు. పోలీసు సిబ్బంది చూపిన సమయస్ఫూర్తి, మానవీయ దృక్పథం, విధి పట్ల నిబద్ధతను ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రజల ప్రాణ రక్షణే పోలీసుల అత్యున్నత బాధ్యత అని పేర్కొంటూ, అత్యవసర పరిస్థితుల్లో ఇలాంటి వేగవంతమైన స్పందన ప్రతి పోలీసు సిబ్బందికి ఆదర్శంగా నిలుస్తుందని అభినందించారు.

దంపతులకు కౌన్సెలింగ్ నిర్వహించి..

2026 జూన్ 18న మెట్‌పల్లి పట్టణంలోని బీడీ కాలనీకి చెందిన దంపతుల మధ్య కుటుంబ కలహాలు చోటుచేసుకోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన మహిళ ఎస్ఆర్ఎస్పి కాలువ వద్దకు వెళ్లి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ విషయమై డయల్-112 ద్వారా సమాచారం అందిన వెంటనే మెట్‌పల్లి పోలీసులు అత్యంత వేగంగా స్పందించారు. సమాచారం అందుకున్న కేవలం 15 నిమిషాల్లోనే ఏఎస్ఐ అన్వర్ బేగ్, కానిస్టేబుల్ ప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమర్థంగా అంచనా వేసి, చాకచక్యంగా వ్యవహరించి మహిళను ఆత్మహత్యాయత్నం నుంచి రక్షించారు. అనంతరం ఆమెను సురక్షితంగా పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి, దంపతులకు కౌన్సెలింగ్ నిర్వహించి కుటుంబ సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించేలా చర్యలు చేపట్టారు.

Next Story