జిల్లా అభివృద్ధి సమావేశానికి పాత గణాంకాలతో అధికారులు

by Taduka Kalyani |

జిల్లాలో ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి దిశానిర్దేశం చేయాల్సిన జిల్లా అభివృద్ధి సమావేశం అధికారుల తీరుతో నవ్వుల పాలైంది.

జిల్లా అభివృద్ధి సమావేశానికి పాత గణాంకాలతో అధికారులు
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : జిల్లాలో ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి దిశానిర్దేశం చేయాల్సిన జిల్లా అభివృద్ధి సమావేశం అధికారుల తీరుతో నవ్వుల పాలైంది. ప్రజా సమస్యల ప్రస్తావన కరువైంది. ప్రధాన శాఖ అధికారులు నివేదికలను చూసి జిల్లా ఇంచార్జి మంత్రి అవాక్కు కాగా, సమావేశానికి హాజరైన ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కే హైమావతి అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా ఇంచార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి, మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు, మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ లు దేశపతి శ్రీనివాస్, వంటేరు ప్రతాప్ రెడ్డి, చిన్నమైల్ అంజిరెడ్డి, మల్క కొమురయ్య హాజరయ్యారు. సమావేశానికి ఆర్టీసీ, యువజన సర్వీసుల శాఖ అధికారులు గైర్హాజరు కాగా, విద్య, హౌసింగ్, విద్యుత్, వ్యవసాయ శాఖ, ఆర్ అండ్ బీ, ఆర్ డబ్ల్యూఎస్, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు తప్పుడు నివేదికలతో సమావేశానికి హాజరు కావడం పట్ల ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే సిరిసిల్ల సిద్దిపేట ప్రధాన రహదారి నిర్మాణానికి సంబంధించి నిర్మాణ కోసం నిధుల కేటాయింపు ప్రపోజల్ చూసి మంత్రి వివేక్ వెంకటస్వామి అవాక్కు అయ్యారు. విషయం పై ఆరా తీయగా గణాంకాలు తప్పుగా ప్రింట్ అయ్యాయని అధికారులు సమాధానం ఇవ్వడం కోస మెరుపు.

అదే విధంగా రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణ లాస్ట్ పేమెంట్ జిల్లాలో 4 డబుల్ బెడ్ రూం ఇండ్లకు మాత్రమే వచ్చిందని సంబంధిత శాఖ అధికారి నిర్లక్ష్యంగా తప్పుడు సమాచారం ఇచ్చారు. తదుపరి జిల్లా కలెక్టర్ నివేదికలు తెప్పించి చూడటంతో జిల్లాలో డబుల్ బెడ్ రూం ఇండ్ల పుల్ పేమెంట్ లు జరుగుతున్నట్లు, డబుల్ బెడ్ రూం ల నిర్మాణం వేగంగా జరుగుతున్నట్లు మంత్రి కి వివరించారు. సంబంధిత శాఖ ఉన్నత అధికారి తీరు పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి తోడు పలు శాఖ అధికారులు కొత్తగా వచ్చా, నివేదికలు లేవు అనే సమాధానాలు చెప్పడం తో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. జిల్లా అభివృద్ధి చర్చించి ఏ శాఖ లో ఏ ఏ పనులు పెండింగ్ లో ఉన్నాయి.. పనులు ఎంత వరకు వచ్చాయి. పనులు త్వరగా పూర్తి కావాలంటే ఏం చేయాలి. రాష్ట్రస్థాయిలో ఏ శాఖ వద్ద జిల్లా అభివృద్ధి పనులు పెండింగ్ లో ఉన్నాయి. జిల్లా అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా ఇంచార్జి మంత్రి దృష్టికి తీసుకెళ్లి పనులు త్వరగా పూర్తి చేయించాల్సిన జిల్లా అధికారులు పాత నివేదికలతో సమావేశానికి హాజరై, నిర్లక్ష్యం గా వ్యవహరించడం తో నవ్వుల పాలుకావడం కోసమెరుపు. సమావేశంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి నియోజక వర్గంలోని సమస్యలను ప్రస్తావించి త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి ని కోరారు. ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, వంటేరు యాదవ రెడ్డిలు పలు సమస్యలను ప్రస్తావించి సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన మంత్రి సమస్యలను పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : జిల్లా ఇంఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి

రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తుందని జిల్లా ఇంచార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. అంచనాలకు మించి వరి ధాన్యం కొనుగోలు జరిపిన సివిల్ సప్లయ్ అధికారులను మంత్రి అభినందించారు. వాన కాలం సీజన్ కు సంబంధించి జిల్లాలో యూరియా కొరత లేదన్నారు. ఆయిల్ ఫాం సాగు వైపు రైతులు మళ్లే విధంగా ఉద్యాన వన శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సన్న వరి సాగుకు రైతులను ప్రోత్సహించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై సమగ్ర నివేదిక తయారు చేసి సద్వినియోగ పరుచుకోవాలన్నారు. పెంకుటిండ్లు నివాసం ఉంటున్న వారికి మొదటి ప్రాధాన్యతగా ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాలన్నారు. ప్రభుత్వ విద్య సంస్థల్లో విద్యార్థుల సంఖ్య పెంచి ఉత్తీర్ణత శాతం పెంచాలన్నారు. నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగ కల్పనే ధ్యేయంగా టాంకాం ద్వారా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. నియోజక వర్గాల్లో శిక్షణ ఏర్పాటుకు చేసుకోవాలని ఎమ్మెల్యేలకు సూచించారు. జిల్లా చేప పిల్లల పంపిణీకి ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

గత మీటింగ్ యాక్షన్ రిపోర్టు ఎక్కడ : మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు

జిల్లాలో మండల, జిల్లా పరిషత్ పాలక మండళ్లు, సిద్దిపేట మున్సిపాలిటీ పాలక మండలికి ఎన్నికలు జరగని కారణంగా ప్రజా సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. జిల్లా అభివృద్ధి సమావేశం మూడు నెలలకు ఒక్క సారి నిర్వహించాలన్నారు. గత సమావేశం లో చర్చించిన అంశాలపై యాక్షన్ రిపోర్టు లేక పోవడం పై అసహనం వ్యక్తం చేశారు. డీడీఆర్ సీ మీటింగ్ సమావేశానికి సంబంధించిన రెండు రోజులుగా ముందుగా సమాచారం ఇవ్వడంతో పాటుగా ఏజెండాను అందిస్తే చర్చించే అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు స్కూల్ డ్రెస్ లు, నోట్ బుక్ లు నేటికి సరఫరా కాలేదన్నారు. ప్రభుత్వ ఇంటర్మీడియెట్ కళాశాలల్లో చాక్ పీస్ లు లేని దుస్థితి నెలకొందన్నారు. డ్రిప్ ఇరిగేషన్ కు సంబంధించి సంబంధిత సంస్థలకు నిధులు విడుదల చేయకపోవడంతో జిల్లాలో ఆయిల్ ఫాం సాగు తగ్గుముఖం పట్టిందన్నారు. వడగండ్ల వాన నష్టపరిహారం జిల్లాలో నేటి రైతులకు అందించ లేదన్నారు. వ్యవసాయానికి 10 గంటలకు మించి విద్యుత్ సరఫరా కావడం లేదన్నారు. ఇందిరమ్మ ఇండ్ల కు చివరి బిల్లులు రావడం లేదన్నారు. జిల్లాలోని ప్రధాన శాఖలకు ఇంచార్జి అధికారులే ఉన్నారని రెగ్యులర్ అధికారులను కేటాయించాలన్నారు. పెండింగ్ లో ఉన్న సిద్దిపేట చిన్నకోడూరు రహదారి పనులు పూర్తి చేయాలన్నారు. అదే విధంగా సిరిసిల్ల సిద్దిపేట రైల్వే లైన్ కు మార్గంలో ఇరిగేషన్ కాలువల పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కోరారు.

కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు

కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు అధికారులకు సూచించారు. ఎంపీ నిధుల నుంచి డబ్బులు కేటాయిస్తా అన్నా పాముల పర్తి వద్ద విద్యుత్ దీపాలు ఏర్పాటుకు విద్యుత్ శాఖ అధికారులు ముందుకు రాక పోవడం దురదృష్టకరం అన్నారు. నివాస సముదాయాల పై సోలార్ యూనిట్ ఏర్పాటు చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుందన్నారు. తోటపల్లి రిజర్వాయర్ నిర్మాణం కోసం సేకరించిన భూములను తిరిగి రైతులకు అందించాలన్నారు. తుక్కాపూర్ వద్ద వాటర్ ట్యాంక్ నిర్మాణం కు సంబంధించి ఆర్ డబ్ల్యూఎస్ అధికారి తీరుపై ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట పట్టణంలోని సంతోషి మాత దేవాలయం, శరభేశ్వర దేవాలయం కు రూ.50 చొప్పున నిధులు మంజూరైనా పనులు ప్రారంభించక పోవడం పై అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించి లబ్ది పొందేలా అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని ఎమ్మెల్సీలు చిన్నమైల్ అంజిరెడ్డి, మల్క కొమురయ్య సూచించారు.

Next Story