- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాపికొండలు విహారయాత్రకు గ్రీన్ సిగ్నల్
పర్యాటకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పాపికొండలు విహారయాత్రకు ఎట్టకేలకు అధికారులు పచ్చజెండా ఊపారు.

దిశ, వెబ్ డెస్క్ : పర్యాటకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పాపికొండలు విహారయాత్రకు ఎట్టకేలకు అధికారులు పచ్చజెండా ఊపారు. దాదాపు ఇరవై రోజుల విరామం తర్వాత, శనివారం నుంచి ఈ విహారయాత్ర తిరిగి ప్రారంభించేందుకు పర్యాటక, పోలీస్ శాఖలు అనుమతులు మంజూరు చేశాయి. పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన గండిపోశమ్మ ఆలయ బోటింగ్ పాయింట్ నుండి ఈ విహారయాత్రలు ప్రారంభం కానున్నాయి. శనివారం నాటి ప్రయాణానికి గాను మొత్తం 15 ప్రైవేట్ బోట్లతో పాటు ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (APTDC)కు చెందిన ఒక ప్రత్యేక బోటును అధికారులు సర్వాంగ సుందరంగా సిద్ధం చేశారు. పర్యాటకుల భద్రత దృష్ట్యా అన్ని బోట్లలో లైఫ్ జాకెట్లు, అత్యవసర రక్షణ పరికరాలను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
సాంకేతిక లోపం.. గత నెల నుంచి నిలిచిన విహారయాత్రలు
గత నెల 14న గండిపోశమ్మ ఆలయం నుంచి గోదావరి నదిలో పాపికొండల వైపు బయలుదేరిన ఒక ప్రైవేట్ పర్యాటక బోటులో దేవీపట్నం పోలీస్ స్టేషన్ సమీపానికి చేరుకోగానే హఠాత్తుగా సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆ బోటు నడి నదిలోనే నిలిచిపోవడంతో పర్యాటకులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. పర్యాటకుల ప్రాణాలకు ఎలాంటి ముప్పు వాటిల్లకూడదనే ఉద్దేశంతో పాపికొండల విహారయాత్రను అధికారులు అప్పట్లో తాత్కాలికంగా నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఇరవై రోజుల్లో బోట్ల ఫిట్‌నెస్, ఇంజిన్ల పనితీరు, డ్రైవర్ల లైసెన్సులను పూర్తిగా పరిశీలించిన అనంతరం పర్యాటక శాఖ మళ్లీ బోటింగ్ పునరుద్ధరణకు అనుమతి ఇవ్వడంతో పర్యాటక రంగ నిర్వాహకులు, బోటు యజమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.






