Air India: జెట్ ఇంధన ధరలు తగ్గడంతో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం

by S Gopi |

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరగడంతో జెట్ ఇంధన ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ఎయిర్ ఇండియా ఈ ఏడాది ఏప్రిల్‌లో ఫ్యూయల్ సర్‌చార్జీలను ప్రవేశపెట్టింది.

Air India: జెట్ ఇంధన ధరలు తగ్గడంతో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో చమురు, జెట్ ఇంధన ధరలు తగ్గడంతో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్, యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే)కు వెళ్లే విమానాలపై విధిస్తున్న ఫ్యూయల్ సర్‌చార్జీలను తగ్గించింది. జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రేట్ల ప్రకారం ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా రూట్లలో టికెట్‌కు 280 డాలర్లుగా ఉన్న సర్‌చార్జీని 200 డాలర్లకు తగ్గించగా, యూరప్, యూకే రూట్లలో 205 డాలర్ల నుంచి 125 డాలర్లకు తగ్గించింది. అయితే ఈ మార్పు ఇతర అంతర్జాతీయ లేదా దేశీయ విమానాలకు వర్తించదని తెలుస్తోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరగడంతో జెట్ ఇంధన ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ఎయిర్ ఇండియా ఈ ఏడాది ఏప్రిల్‌లో ఫ్యూయల్ సర్‌చార్జీలను ప్రవేశపెట్టింది. ఆ సమయంలో పెరిగిన ఇంధన వ్యయం, గగనతల పరిమితుల కారణంగా విమానాల నిర్వహణ ఖర్చులు గణనీయంగా పెరిగాయి. అయితే ఇటీవల చమురు ధరలు తగ్గడం, కొంత ఉపశమనం లభించడంతో ఈ సర్‌చార్జీలను తగ్గించినట్లు వెల్లడించింది. విమానయాన రంగంలో మొత్తం నిర్వహణ వ్యయంలో ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) వాటా సుమారు 40-45 శాతం ఉండటంతో, ఇంధన ధరల్లో వచ్చే మార్పులు టికెట్ ధరలు, సర్‌చార్జీలపై నేరుగా ప్రభావం చూపుతుంటాయి.

Next Story