మోడీ కేబినెట్ విస్తరణ? కొందరు సీనియర్లు ఔట్.. కొత్త వారికి ఛాన్స్‌

by velandi.Saikiran |

మరో రెండు వారాల్లో కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశముంది.

మోడీ కేబినెట్ విస్తరణ? కొందరు సీనియర్లు ఔట్.. కొత్త వారికి ఛాన్స్‌
X

మోడీ కేబినెట్ విస్తరణ?

- కొందరు సీనియర్లు ఔట్.. కొత్త ముఖాల చేరిక

- రాష్ట్రాలు, కమ్యూనిటీ, పార్టీకి విధేయతల ఈక్వేషన్‌తో మార్పు చేర్పులు

- వర్షాకాల సమావేశాలకు ముందే కొత్త కేబినెట్!

దిశ, నేషనల్ బ్యూరో: మరో రెండు వారాల్లో కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశముంది. దానికంటే ముందుగా బీజేపీ జాతీయ కార్యవర్గం ప్రకటన ఉంటుందని సమాచారం. కేంద్రమంత్రి అమిత్ షా, బీఎల్ సంతోష్‌‌లతో సుదీర్ఘ సంప్రదింపుల తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తన కొత్త టీంను ఖరారు చేసుకున్నట్టు తెలుస్తున్నది. ఇది వరకే రాష్ట్ర విభాగాలు బీజేపీ నేషనల్ టీంకు పేర్లు సూచించగా.. ఎంపిక ప్రక్రియ కూడా పూర్తయిందని సమాచారం. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు, జనరల్ సెక్రెటరీలు, సెక్రెటరీల, సెంట్రల్ మీడియా టీం ఎంపిక ప్రక్రియ కూడా పూర్తయినట్టు తెలిసింది. అయితే, ప్రధానమంత్రి మోడీ ఈ నెల 6 నుంచి 11వ తేదీ వరకు విదేశీ పర్యటన చేయనున్న తరుణంలో ఆయన తిరిగి వచ్చాక.. వర్షాకాల సమావేశాలకు ముందుగా బీజేపీ నేషనల్ టీం ప్రకటనతోపాటు కేంద్ర కేబినెట్ విస్తరణ ఉంటుందని చెబుతున్నారు. ఈ నెల మూడో వారంలో వర్షాకాల సమావేశాలు జరిగే అవకాశముంది. ఈ కొత్త టీం త్వరలో జరగనున్న రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, 2029 లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా పని చేయనున్నారు.

ఎన్నికల రాష్ట్రాలకు పెద్దపీట

పశ్చిమ బెంగాల్‌లో అద్భుత విజయాన్ని అందించిన బీజేపీ విభాగం నుంచి కేబినెట్‌లో ప్రాతినిధ్యం ఉంటుందని తెలుస్తున్నది. అలాగే, వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలపైనా కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టిందని, ఈ రాష్ట్రాల నుంచి కీలక నేతలకు మంత్రివర్గంలో చోటుదక్కనుంది. రాష్ట్రాలు, కమ్యూనిటీ, పార్టీపట్ల విధేయత, ఉత్తరాది, దక్షిణాది ప్రాంతాలను బ్యాలెన్స్ చేస్తూ కొత్త కేబినెట్‌లో మార్పులు చేర్పులు జరగనున్నాయి.

వన్ మ్యాన్.. వన్ పోస్ట్ ఫార్ములా

సొంత పార్టీ నేతలు, స్పెషల్ ఫోకస్ ఉన్న రాష్ట్రాల నేతలకు ప్రమోషన్ లేదా కొత్త పదవులు ఇవ్వడం ఒకవైపు మిత్రపక్షాల పార్టీలకూ ఊరటకల్పించడం మరోవైపు బీజేపీ దృష్టిలో ఉన్నాయి. పార్టీ పదవుల నుంచి కొందరు మోడీ కేబినెట్‌లోకి చేరుతుండగా, మరికొందరు సీనియర్లు మంత్రివర్గం నుంచి పార్టీ పదవులకు షిఫ్ట్ అయ్యే చాన్స్ ఉన్నది. ఇంకొందరు సీనియర్ నాయకులను రాష్ట్రాల గవర్నర్లుగా నియమించనుంది. అలాగే, కేంద్ర కేబినెట్‌లో ఉన్న మంత్రుల పోర్ట్‌ఫోలియోల్లోనూ మార్పులు జరిగే అవకాశముంది. పెద్దస్థాయిలో జరగనున్న ఈ మార్పులు, చేర్పులకు బీజేపీ అనుసరించే ఒక వ్యక్తికి, ఒకే పోస్టు అనే సూత్రాన్ని అమలు చేయనున్నట్టు తెలుస్తున్నది.

ఇది వరకే పలువురి స్థానచలనం

ఇద్దరు కేంద్రమంత్రులు జార్జ్ కురియన్, రవనీత్ సింగ్ బిట్టులను కేంద్ర ప్రభుత్వం మళ్లీ రాజ్యసభకు నామినేట్ చేయలేదు. వీరిలో కురియన్ ఇది వరకే రాజీనామా చేయగా.. బిట్టును పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దింపనున్నట్టు సమాచారం. నవంబర్‌లో కేంద్రమంత్రులు హర్దీప్ సింగ్ పూరి, బీఎల్ వర్మల పదవీకాలం ముగియనుంది. వీరిని మళ్లీ రాజ్యసభకు నామినేట్ చేస్తుందా? లేదా? అనేది చూడాల్సి ఉన్నది. థావర్‌చంద్ గెహ్లాట్(కర్ణాటక), మంగూభాయ్ పటేల్(మధ్యప్రదేశ్), లెఫ్టినెంట్ జనరల్ గుర్మీత్ సింగ్(ఉత్తరాఖండ్‌)ల పదవీకాలం జులై, సెప్టెంబర్‌లలో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే కేంద్రకేబినెట్ నుంచి తొలగించినవారిని రాష్ట్రాల గవర్నర్‌లుగా భర్తీ చేయనున్నట్టు తెలుస్తున్నది. అలాగే, రాష్ట్రస్థాయి పదవులు చేపట్టిన కేంద్రమంత్రులు హర్ష్ మల్హోత్రా, పంకజ్ చౌదరిలు మంత్రిపదవులను వదిలిపెట్టనున్నారు.

ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యతలు నిర్మలమ్మకు?

ప్రస్తుత వాణిజ్య మంత్రి పియూష్ గోయల్‌కు ఆర్థిక శాఖ అప్పగించే చాన్స్ ఉన్నదని, నిర్మల సీతారామన్‌కు విద్యా శాఖ బాధ్యతలు అప్పగించే అవకాశమున్నదని ప్రచారం జరుగుతున్నది. నీట్ లీకేజీ కారణంగా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న ధర్మేంద్ర ప్రధాన్ మంత్రిపదవిని కోల్పోతారనే ప్రచారం జరుగుతున్నది. అనురాగ్ ఠాకూర్‌కు మళ్లీ కేబినెట్‌లో చోటుదక్కనున్నట్టు తెలుస్తున్నది. ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత దాస్‌కు కేబినెట్ అవకాశం కల్పించే అవకాశమున్నదని, దేశ ఆర్థిక విధానాన్ని గైడ్ చేయడానికి ఆర్థిక నిపుణులపై కేంద్రం ఫోకస్ పెట్టినట్టు సమాచారం. పంజాబ్ నుంచి తరుణ్ చుగ్‌కు కేబినెట్‌లో అవకాశం దక్కొచ్చు.

నితీశ్ కుమార్‌, రాఘవ్ చద్దాకూ అవకాశం!

ఎన్డీయేకు బలాన్ని పెంచిన మిత్రపక్షాలకూ కేంద్రం రివార్డు ఇవ్వనుంది. పలువురు ఎంపీలతో ఆప్ నుంచి బీజేపీలో చేరిన రాఘవ్ చద్దా(పంజాబ్)కు కేబినెట్ బెర్త్ లభించే అవకాశముంది. మహారాష్ట్రలో బలాన్ని పెంచిన శివసేనకు ఒక సీటు ఖరారైనట్టు సమాచారం. శ్రీకాంత్ షిండే లేదా ఏక్‌నాథ్ షిండే సూచించిన నేతకు ఈ అవకాశం దక్కనుంది. సీఎం పదవికి రాజీనామా చేసిన జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్‌ కేబినెట్‌లో కీలక పోర్ట్‌ఫోలియో దక్కే అవకాశముంది.

20 నుంచి వర్షాకాల సమావేశాలు!

ఈ నెల 20వ తేదీ నుంచి వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యే చాన్స్ ఉన్నది. 19 సిట్టింగ్‌లతో దాదాపు ఆగస్టు 13వ తేదీ వరకు ఈ సమావేశాలు జరగొచ్చు. ఈ సారి సమావేశాల్లో పార్టీల మధ్య సరికొత్త సమీకరణాలు కనిపించనున్నాయి. తృణమూల్ కాంగ్రెస్‌లో చీలిక, ఉద్ధవ్ సేన తిరుగుబాటు ఎంపీలు, డీఎంకే, కాంగ్రెస్‌ల మధ్య దూరం వంటివి స్పష్టంగా కనిపించనున్నాయి. ఈ ఫిరాయింపులు, కొత్త కూటములు, విలీనాల నేపథ్యంలో సభలో ఎంపీల సీటింగ్‌లోనూ మార్పులు జరగనున్నాయి. అలాగే, ఈ చీలిక, ఫిరాయింపులపైనా స్పీకర్ ఓంబిర్లా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్నది.

Next Story