Chinese Apps: బ్యాట్ బీఎంఎస్ యాప్‌పై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు

by S Gopi |

ఈ వాహనాల్లో ఉపయోగించే బ్యాటరీల నిర్వహణకు సంబంధించిన కొన్ని చైనీస్ స్మార్ట్‌ఫోన్ యాప్‌ల ద్వారా, దేశంలోని ఈ-రిక్షాలను ‘రిమోట్ కంట్రోల్’ ద్వారా పూర్తిగా లాక్ చేయవచ్చని, వాటిని పని చేయకుండా నిలిపివేయవచ్చని కొన్ని వీడియోలు ఇంటర్నెట్‌లో సర్క్యులేట్ అవుతున్నాయి.

Chinese Apps: బ్యాట్ బీఎంఎస్ యాప్‌పై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు
X

దిశ, బిజినెస్ బ్యూరో: బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ వాహనాలను రిమోట్ ద్వారా నిలిపివేస్తున్నాయనే ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మూడు చైనీస్ మొబైల్ యాప్‌లపై కఠిన చర్యలు తీసుకుంది. బ్యాట్-బీఎంఎస్, లాసిజీ, ఎపోచ్-ఐ-అయాన్ యాప్‌లను యాప్ స్టోర్ల నుంచి తొలగించాలని ప్రభుత్వం ఆదేశించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం మార్కెట్లోకి వస్తున్న ఎలక్ట్రిక్ వాహనాలలో (ముఖ్యంగా ఈ-రిక్షాలలో) బ్యాటరీ పనితీరును పర్యవేక్షించడానికి ‘బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్’ (బీఎంఎస్) అనే ఇంటర్నెట్ ఆధారిత సాఫ్ట్‌వేర్‌ను వాడుతున్నారు. అయితే, ఈ వాహనాల్లో ఉపయోగించే బ్యాటరీల నిర్వహణకు సంబంధించిన కొన్ని చైనీస్ స్మార్ట్‌ఫోన్ యాప్‌ల ద్వారా, దేశంలోని ఈ-రిక్షాలను ‘రిమోట్ కంట్రోల్’ ద్వారా పూర్తిగా లాక్ చేయవచ్చని, వాటిని పని చేయకుండా నిలిపివేయవచ్చని కొన్ని వీడియోలు ఇంటర్నెట్‌లో సర్క్యులేట్ అవుతున్నాయి. ఈ తీవ్రమైన దేశ భద్రతా సమస్యపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం, శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది.

దేశంలో వేగంగా విస్తరిస్తున్న ఈవీ రంగాన్ని టార్గెట్ చేస్తూ సాగుతున్న ఇటువంటి సైబర్ భద్రతా లోపాలను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) నిర్వహించిన సైబర్ భద్రతా సదస్సులో కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శి ఎస్. కృష్ణన్ మాట్లాడుతూ.. యాప్ స్టోర్లు ఇష్టానుసారంగా కాకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేశారు. వినియోగదారుల భద్రతకు, దేశ సార్వభౌమత్వానికి హాని కలిగించే ఎలాంటి యాప్‌లైనా సరే అందుబాటులో లేకుండా చూడటంపై యాప్ స్టోర్ల యాజమాన్యాలతో ప్రభుత్వం చర్చిస్తోందని ఆయన వెల్లడించారు. ఇలాంటి యాప్‌లను ఉపయోగించి ఇతరుల వాహనాలను రిమోట్ ద్వారా నిలిపివేయడం ఐటీ చట్టం ప్రకారం తీవ్రమైన నేరమని, అలా హ్యాకింగ్‌కు పాల్పడితే మూడేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 5 లక్షల వరకు జరిమానా విధిస్తామని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ-రిక్షాల భద్రతను పణంగా పెడుతూ సోషల్ మీడియాలో 'ప్రాంక్ వీడియోల' కోసం వాహనాలను లాక్ చేస్తున్న వారిని అడ్డుకట్ట వేసేందుకే కేంద్రం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.

Next Story