- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గర్భస్రావం కాదు.. ప్రాణాంతక 'ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ'
సాధారణ గర్భస్రావం (మిస్క్యారేజ్) అనుకుని పొరబడటంతో నెల రోజులకు పైగా తీవ్ర రక్తస్రావంతో ప్రాణాపాయ స్థితికి చేరుకున్న ఒక 27 ఏళ్ల మహిళకు హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని 'బర్త్‌రైట్ బై రెయిన్‌బో' ఆసుపత్రి వైద్యులు పునర్జన్మ ప్రసాదించారు.

- మహిళకు ప్రాణదానం చేసిన బర్త్‌రైట్ బై రెయిన్‌బో వైద్యులు
- ల్యాపరోస్కోపీ ద్వారా గర్భాశయం, సంతానోత్పత్తి సామర్థ్యం భద్రం
దిశ, తెలంగాణ బ్యూరో: సాధారణ గర్భస్రావం (మిస్క్యారేజ్) అనుకుని పొరబడటంతో నెల రోజులకు పైగా తీవ్ర రక్తస్రావంతో ప్రాణాపాయ స్థితికి చేరుకున్న ఒక 27 ఏళ్ల మహిళకు హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని 'బర్త్‌రైట్ బై రెయిన్‌బో' ఆసుపత్రి వైద్యులు పునర్జన్మ ప్రసాదించారు. వైద్య చరిత్రలోనే అత్యంత అరుదైన 'క్రానిక్ సిజేరియన్ స్కార్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ' సమస్యను గుర్తించి, అత్యాధునిక శస్త్రచికిత్స ద్వారా ఆమె గర్భాశయాన్ని, భవిష్యత్తు సంతానోత్పత్తి సామర్థ్యాన్ని కాపాడారు. ఆసుపత్రి వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. సదరు మహిళకు గతంలో సిజేరియన్ (సి-సెక్షన్) ద్వారా ప్రసవం జరిగింది. రెండోసారి గర్భం దాల్చిన ఆరో వారంలో రక్తస్రావం కావడంతో, మరో ఆసుపత్రిలో స్కానింగ్ చేసి గర్భస్రావం అయిందని భావించి డీ అండ్ ఈ (డిలేటేషన్ అండ్ ఎవాక్యూయేషన్) ప్రక్రియ చేశారు. అయినప్పటికీ ఆమెకు నెల రోజులుగా రక్తస్రావం ఆగలేదు. నిరంతర రక్తహీనతతో నీరసించిపోయిన ఆమె తుది ప్రయత్నంగా రెయిన్‌బో బర్త్‌రైట్ ఆసుపత్రిని ఆశ్రయించింది.
అరుదైన సమస్య గుర్తింపు..
బర్త్‌రైట్ బై రెయిన్‌బో ఆసుపత్రి కన్సల్టెంట్ అబ్‌స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ డాక్టర్ మానస బద్వేలి నేతృత్వంలోని వైద్య బృందం ఆమెకు అల్ట్రాసౌండ్, పెల్విస్ ఎంఆర్ఐ పరీక్షలు నిర్వహించింది. పిండం గర్భాశయంలో కాకుండా, గతంలో సిజేరియన్ జరిగిన కుట్టు భాగంలో (స్కార్) పెరిగినట్లు వైద్యులు గుర్తించారు. లక్ష మంది గర్భిణులలో ఒకరికి మాత్రమే వచ్చే అత్యంత అరుదైన 'సిజేరియన్ స్కార్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ'గా దీనిని నిర్ధారించారు. కుట్టు భాగం చుట్టూ గట్టిగా అతుక్కుపోవడం వల్లే అది పేలకుండా (రప్చర్ అవ్వకుండా) ఉండిపోయిందని, లేదంటే అంతర్గత రక్తస్రావంతో ప్రాణాలకే ముప్పు వచ్చేదని వైద్యులు తెలిపారు. పరిస్థితి తీవ్రతను గమనించిన వైద్య బృందం ల్యాపరోస్కోపిక్ (కీహోల్) సర్జరీ ద్వారా కుట్టు భాగంలో ఉన్న పిండాన్ని విజయవంతంగా తొలగించింది. అనంతరం దెబ్బతిన్న గర్భాశయ గోడను 'టూ-లేయర్ యుటెరైన్ రీకన్‌స్ట్రక్షన్' పద్ధతిలో పటిష్టంగా పునర్నిర్మించారు. రక్తహీనతను నివారించేందుకు ఆమెకు రక్తాన్ని ఎక్కించారు.
నిర్లక్ష్యం వద్దు.. డాక్టర్ మానస బద్వేలి
ఈ కేసుపై డాక్టర్ మానస బద్వేలి మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా సిజేరియన్ కాన్పులు పెరుగుతున్న తరుణంలో ఈ అరుదైన సమస్యపై అవగాహన అవసరమన్నారు. సిజేరియన్ అయిన మహిళల్లో గర్భస్రావం జరిగిన వారం రోజుల తర్వాత కూడా రక్తస్రావం అవుతుంటే సాధారణంగా భావించవద్దని, వెంటనే నిపుణులైన వైద్యులను సంప్రదించి అవసరమైతే ఎంఆర్ఐ వంటి అధునాతన పరీక్షలు చేయించుకోవాలని ఆమె సూచించారు.






