మురుగునీటి శుద్ధిలో జపాన్ అత్యాధునిక సాంకేతికత

by Ajay Maddhiboyina |

జలమండలి పరిధిలోని నాలాలు, చెరువులు, డ్రెయిన్ ల శుద్ధీకరణకు వినూత్న పరిష్కారంగా జపాన్‌కు చెందిన అత్యాధునిక బయో-లేస్ (Bio-Lace) సాంకేతికతతో అమలు చేస్తున్న 1 ఎంఎల్‌డీ సామర్థ్యం గల పైలట్ ప్రాజెక్టు పనితీరును జలమండలి ఎండీ అశోక్ రెడ్డి శుక్రవారం పరిశీలించి సమీక్షించారు.

మురుగునీటి శుద్ధిలో జపాన్ అత్యాధునిక సాంకేతికత
X

దిశ, తెలంగాణ బ్యూరో: జలమండలి పరిధిలోని నాలాలు, చెరువులు, డ్రెయిన్ ల శుద్ధీకరణకు వినూత్న పరిష్కారంగా జపాన్‌కు చెందిన అత్యాధునిక బయో-లేస్ (Bio-Lace) సాంకేతికతతో అమలు చేస్తున్న 1 ఎంఎల్‌డీ సామర్థ్యం గల పైలట్ ప్రాజెక్టు పనితీరును జలమండలి ఎండీ అశోక్ రెడ్డి శుక్రవారం పరిశీలించి సమీక్షించారు. పైలట్ ప్రాజెక్టు ద్వారా సాధించిన ఫలితాలు, నీటి నాణ్యతలో వచ్చిన మెరుగుదల, భవిష్యత్ కార్యాచరణపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. ఫతేనగర్‌లోని జలమండలి ఎస్టీపీ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో జైకా ప్రతినిధులు, టీబీఆర్ సంస్థ సాంకేతిక నిపుణులు జలమండలి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జైకా), జపాన్‌కు చెందిన టిబీఆర్ సంస్థల సహకారంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు భారతదేశంలో తొలిసారిగా ప్రవహిస్తున్న కాలుష్యగ్రస్త నాలా నీటి శుద్ధీకరణకు అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన బయో-లేస్ సాంకేతికతను ప్రయోగాత్మకంగా అమలు చేసిన ప్రాజెక్టుగా నిలిచింది. జైకా–జలమండలి–టీబీఆర్ సంస్థల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం (MoU) మేరకు ఈ పైలట్ ప్రాజెక్టును అమలు చేశారు.

ఈ సందర్భంగా జలమండలి ఎండీ కె. అశోక్ రెడ్డి మాట్లాడుతూ... జపాన్‌లో ఇప్పటికే 400కు పైగా నదులు, జలమార్గాల పునరుద్ధరణలో విజయవంతంగా ఉపయోగించిన ఈ సాంకేతికత హైదరాబాద్‌లో కూడా ఆశాజనక ఫలితాలను అందించిందన్నారు. పైలట్ ప్రాజెక్టు ద్వారా నిర్వహించిన పరీక్షల్లో నీటి నాణ్యత గణనీయంగా మెరుగుపడటంతో పాటు, పట్టణ నాలాల కాలుష్య నియంత్రణకు ఇది సమర్థవంతమైన, పర్యావరణహిత పరిష్కారంగా నిలుస్తుందని తెలిపారు. మూసీ నదిలో ఒక్క చుక్క మురుగునీరు కూడా చేరకుండా, హైదరాబాద్ నగర పరిధిలో ఉత్పత్తి అయ్యే మురుగునీటిని 100 శాతం శుద్ధి చేసిన అనంతరమే విడుదల చేయాలన్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జలమండలి సమగ్ర కార్యాచరణను అమలు చేస్తోంది. రానున్న ఏడాదిలో ఈ లక్ష్యాన్ని సాధించే దిశగా వేగంగా ముందుకు సాగుతున్నాం" అని జలమండలి ఎండీ కె. అశోక్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం పైలట్ యూనిట్‌లో పంపింగ్ ద్వారా మురుగునీటిని శుద్ధి చేస్తున్నామని, భవిష్యత్తులో ఈ సాంకేతికతను నేరుగా నాలాలు, వాగుల్లో ప్రవహించే మురుగునీటిపైనే అమలు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. పైలట్ ప్రాజెక్టు ఫలితాలను సమగ్రంగా అధ్యయనం చేసిన అనంతరం నగరంలోని ఇతర ప్రాంతాలకు కూడా ఈ సాంకేతికతను విస్తరించే అంశంపై సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని అధికారులకు సూచించారు.

సాంప్రదాయ మురుగునీటి శుద్ధి కేంద్రాలతో పోలిస్తే ఈ బయో-లేస్ సాంకేతికతకు భారీ భూవిస్తీర్ణం అవసరం ఉండదని, 50 శాతానికి పైగా విద్యుత్ ఆదా, 70–85 శాతం తక్కువ భూవిస్తీర్ణం, రసాయనాల వినియోగం లేకుండా సహజ సూక్ష్మజీవుల ద్వారా శుద్ధీకరణ, తక్కువ నిర్వహణ వ్యయం వంటి ప్రత్యేకతలు ఉన్నాయని అధికారులు వివరించారు. అదేవిధంగా బురద (Sludge) ఉత్పత్తి కూడా గణనీయంగా తగ్గుతుందని తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన పైలట్ ప్రాజెక్టులో సేంద్రియ కాలుష్యం (BOD)లో 90 శాతం, సస్పెండెడ్ సాలిడ్స్ (TSS)లో 85 శాతం తగ్గుదల నమోదైందని, దుర్వాసన తగ్గడంతో పాటు నీటిలో కరిగిన ఆక్సిజన్ స్థాయిలు మెరుగుపడి మూసీ, సరస్సులు, నదుల్లోకి చేరే నీటి నాణ్యత గణనీయంగా పెరిగినట్లు టిబీఆర్ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఈ సాంకేతికత పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పరిశీలించిన తర్వాత పూర్తిస్థాయిలో భవిష్యత్తులో హైదరాబాద్‌లో నిర్మించనున్న కొత్త మురుగునీటి శుద్ధి కేంద్రాల్లో ఈ విధానాన్ని అమలు చేసే అవకాశాలను పరిశీలించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జలమండలి సీజీఎమ్ సుజాత, ప్రాజెక్టు అధికారులు, జైకా ప్రతినిధులు, టీబీఆర్ సంస్థ సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.

ముఖ్యాంశాలు:

* దేశంలో తొలిసారిగా బయో-లేస్ సాంకేతికతతో నాలా శుద్ధి పైలట్ ప్రాజెక్టు.

* జపాన్ సాంకేతికత ఆధారంగా ఏర్పాటు చేసిన 1 ఎంఎల్‌డీ పైలట్ ఎస్టీపీ.

* జపాన్‌లో 400కు పైగా నదుల పునరుద్ధరణలో విజయవంతంగా వినియోగించిన సాంకేతికత.

* BODలో 90%, TSSలో 85% తగ్గుదల.

* 50%కు పైగా విద్యుత్ ఆదా.

* 70–85% తక్కువ భూవిస్తీర్ణం అవసరం.

* రసాయనాల వినియోగం లేకుండా పర్యావరణహిత శుద్ధీకరణ.

* తక్కువ నిర్వహణ వ్యయంతో దీర్ఘకాలిక, సుస్థిర పరిష్కారం.

Next Story