పీడితుల పిళ్లనగ్రోవి అరుణోదయ నాగన్న కన్నుమూత

by Ratna Kumari |

తిరుమలాయపాలెం మండలం రాజారాం గ్రామానికి చెందిన ప్రముఖ జానపద గాయకుడు, అరుణోదయ రాష్ట్ర అధ్యక్షుడు, సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్–ప్రజాపంథా రాష్ట్ర కమిటీ సభ్యుడు పరకాల నాగన్న (అరుణోదయ నాగన్న) శుక్రవారం కన్నుమూశారు.

పీడితుల పిళ్లనగ్రోవి అరుణోదయ నాగన్న కన్నుమూత
X

దిశ, తిరుమలాయపాలెం : తిరుమలాయపాలెం మండలం రాజారాం గ్రామానికి చెందిన ప్రముఖ జానపద గాయకుడు, అరుణోదయ రాష్ట్ర అధ్యక్షుడు, సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్–ప్రజాపంథా రాష్ట్ర కమిటీ సభ్యుడు పరకాల నాగన్న (అరుణోదయ నాగన్న) శుక్రవారం కన్నుమూశారు.

గత ఏడాది బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన నాగన్న చికిత్స అనంతరం కోలుకున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం మళ్లీ అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు.

సుమారు ఐదు దశాబ్దాల పాటు రైతులు, కార్మికులు, గిరిజనులు, భూ హక్కుల ఉద్యమాలు, ప్రజాపోరాటాలకు తన పాటలను ఆయుధంగా మలిచిన నాగన్న, సామాజిక మార్పు కోసం అనేక విప్లవ గీతాలను రచించి ఆలపించారు. తన ఆట, పాటలతో పీడిత ప్రజల స్వరంగా నిలిచి, "పీడితుల పిళ్లనగ్రోవి"గా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు.

అరుణోదయ నాగన్న మృతి పట్ల వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, కళాకారులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

నాగన్న భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం శుక్రవారం రాత్రి వరకు ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో ఉంచనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. శనివారం స్వగ్రామమైన రాజారాంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

Next Story