- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాలువల పూడికకు నిధులు ఎంతైనా ఖర్చు చేస్తాం
మధ్యతరహాకు చెందిన వైరా రిజర్వాయర్ కుడి, ఏడమ ప్రధాన కాల్వల్లో పేరుకుపోయిన పూడికను తీసేందుకు నిధులు ఎంతైనా ఖర్చు చేస్తామని వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ స్పష్టం చేశారు.

దిశ, వైరా : మధ్యతరహాకు చెందిన వైరా రిజర్వాయర్ కుడి, ఏడమ ప్రధాన కాల్వల్లో పేరుకుపోయిన పూడికను తీసేందుకు నిధులు ఎంతైనా ఖర్చు చేస్తామని వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ స్పష్టం చేశారు. 10 రోజుల్లోపు ఈ పనులు పూర్తి చేసి ఆ తర్వాత వెంటనే నారుమళ్ళకు సాగునీరు విడుదల చేస్తామని స్పష్టం చేశారు. వైరాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం రిజర్వాయర్ నుంచి సాగునీరు విడుదల చేసే విషయంపై రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏడమ కాల్వ రైతులు మాట్లాడుతూ నారుమళ్లు పెంచేందుకు వెంటనే కాల్వలకు నీరు విడుదల చేయాలని కోరారు.
కుడి కాల్వ రైతులు మాట్లాడుతూ తాము ఎదపెట్టే పద్ధతిలో వరి సాగు చేస్తున్నామని, ముందు పూడికతీత పనులు చేపట్టి ఆ తర్వాత నీటి విషయంపై ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతిగా పనిచేస్తుందని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్లపాటు కనీసం మొక్కజొన్నలను కొనుగోలు చేయలేదన్నారు. గడిచిన రబీ సీజన్లో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి వైరా నియోజకవర్గంలో మొక్కజొన్నలను కొనుగోలు చేయించానని స్పష్టం చేశారు. మొదట కొణిజర్లలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించానని, ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు జరిగాయని వివరించారు.
వైరా రిజర్వాయర్ ను గోదావరి జలాలతో అనుసంధానం చేయించేందుకు ప్రభుత్వం రూ.100 కోట్లతో కాల్వను తవ్వించిందని, రిజర్వాయర్ కాల్వలను రూ.50 కోట్ల నిధులతో ఆధునికరిస్తున్నామని పేర్కొన్నారు. వైరా రిజర్వాయర్ కు వానదేవుడు అన్యాయం చేయడని, మరోవైపు గోదావరి 25 అడుగుల దాటితే ఆ జలాలను వైరాకు తీసుకువచ్చే వెసులుబాటు ఉందని, నాగార్జునసాగర్ కు నీరు వచ్చిన వైరా రిజర్వాయర్ కు విడుదల చేసే అవకాశం ఉందని వివరించారు. ఎలినో ప్రభావం దేశవ్యాప్తంగా ఉన్నందున వర్షాలు పడే అవకాశాలపై అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. అందువలన రైతులు నీటిని వృధా చేయవద్దని చెప్పారు.
గత నెల 28నే నీటిని విడుదల చేసేందుకు ప్రయత్నించాం..
సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్
మధ్యతరహకు చెందిన వైరా రిజర్వాయర్ కు గోదావరి జలాలను విడుదల చేయించేందుకు గత నెల 28వ తేదీన ప్రయత్నించామని సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ స్పష్టం చేశారు. 28వ తేదీ వరకు గోదావరి 25 అడుగులు దాటి ప్రవహించిందని చెప్పారు. దీంతో వెంటనే తాను వైరా ఎమ్మెల్యే రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తో మాట్లాడి నీటిని విడుదల చేయించేందుకు అనుమతులు తీసుకున్నామన్నారు.
అయితే దురదృష్టవశాత్తు అదే రోజు రాత్రి గోదావరి నీటిమట్టం తగ్గిందని వివరించారు. గోదావరి నీటిమట్టం 25 అడుగులు దాటి ప్రవహిస్తే గత నెల 30వ తేదీ లోపే వైరా రిజర్వాయర్ కు రెండు నుంచి మూడు అడుగుల గోదావరి జలాలు వచ్చేవని పేర్కొన్నారు. గోదావరి 25 అడుగులు దాటి ఉదృతంగా ప్రవహిస్తే వెంటనే ఆ జలాలను వైరా రిజర్వాయర్ కు తీసుకువస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శీలం వెంకట నర్సిరెడ్డి, కాంగ్రెస్ డాక్టర్ సెల్ జిల్లా అధ్యక్షుడు కాపా మురళీకృష్ణ, వైరా మార్కెట్ కమిటీ చైర్మన్ బోళ్ల గంగారావు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కట్ల రంగారావు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు, కిసాన్ కేత్ రాష్ట్ర నాయకులు దాసరి దానియేలు, నీటిపారుదల శాఖ ఖమ్మం ఈఈ బాబురావు, వైరా డిఈ పీ.శ్రీనివాస్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు శీలం వెంకట నర్సిరెడ్డి, పలు గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.






