- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ ఇంచార్జ్ ఘాటు విమర్శలు..
హుజురాబాద్‌లో ఇంటింటికీ తిరిగి ఓట్ల సవరణపై కాంగ్రెస్ ఇంచార్జ్ అవగాహన కల్పించారు.

దిశ, హుజురాబాద్ రూరల్: రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ స్పష్టం చేశారు. శుక్రవారం హుజురాబాద్ పట్టణంలోని 14, 17 వార్డులలో జరిగిన సమగ్ర ఓటు సవరణ అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డుల్లో ఇంటింటికీ తిరుగుతూ ఓటర్ల సవరణ ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రణవ్ మాట్లాడుతూ.. స్థానిక బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. "కళ్ళుండి చూడలేని వ్యక్తి కౌశిక్ రెడ్డి" అని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో రెండున్నర ఏళ్ల పాటు ఎమ్మెల్సీగా, ప్రభుత్వ విప్‌గా ఉండి కూడా నియోజకవర్గానికి కౌశిక్ రెడ్డి చేసిందేమీ లేదని.. అప్పుడు చేయలేని పనులను ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపిస్తోందని అన్నారు.
మహిళా సాధికారత కోసం...
ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలు ప్రజల కళ్ళ ముందే కనిపిస్తున్నాయని ప్రణవ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పథకమైన 'ఇందిరమ్మ ఇళ్ల' నూతన గృహ ప్రవేశానికి స్వయంగా కౌశిక్ రెడ్డి వెళ్లి రిబ్బన్ కట్ చేయడమే కాంగ్రెస్ ఆరు గ్యారంటీల విజయానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్నబియ్యం పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రుణమాఫీ, రైతు భరోసా, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంపు, మహిళా సాధికారత కోసం వడ్డీ లేని రుణాలు విజయవంతంగా అందిస్తున్నట్లు వివరించారు.నియోజకవర్గంలో వైద్య రంగానికి పెద్దపీట వేస్తూ ఆసుపత్రులలో మౌలిక సదుపాయాల కోసం రూ.30 లక్షలు, డయాలసిస్ సెంటర్లను మంజూరు చేయించామని చెప్పారు. అలాగే ఇల్లందుకుంటలో నూతన రెవెన్యూ భవనాన్ని కూడా ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో పంపిణీ చేస్తున్న కళ్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నవేనని ఆయన గుర్తు చేశారు.
ఓటు హక్కును కాపాడుకోవాలి..
బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో జరిగినట్లు ఇక్కడ కూడా ఓట్ల తొలగింపు పేరిట నిజమైన ఓటర్ల హక్కులకు భంగం కలగకుండా ఉండాలంటే, ప్రతి పౌరుడు ఈ సమగ్ర ఓటు సవరణ ప్రక్రియలో తమ వివరాలను సరిచూసుకోవాలని ప్రణవ్ పిలుపునిచ్చారు. ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత బీఎల్ఓ బీఎల్ఏ లను సంప్రదించాలన్నారు. ఈ ప్రక్రియపై వార్డు కో-ఆర్డినేటర్లు, బూత్ లెవెల్ ఏజెంట్లు ఓటర్లకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని, స్థానిక కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, ఎస్ఎస్ఆర్ హుజురాబాద్ కో-ఆర్డినేటర్, కాంగ్రెస్ పట్టణ, మండల అధ్యక్షులు, వార్డు కో-ఆర్డినేటర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






