- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కీసర సర్కిల్‌లో అధికారుల ‘జాడ’ లేదు..!
ప్రజలకు పరిపాలనను మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొత్త సర్కిళ్లను ఏర్పాటు చేసినప్పటికీ, కీసర సర్కిల్ కార్యాలయంలో అధికారుల గైర్హాజరుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

దిశ, మేడ్చల్ బ్యూరో : ప్రజలకు పరిపాలనను మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొత్త సర్కిళ్లను ఏర్పాటు చేసినప్పటికీ, కీసర సర్కిల్ కార్యాలయంలో అధికారుల గైర్హాజరుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అధికారులు అందుబాటులో లేకపోవడంతో వివిధ పనుల కోసం వచ్చే ప్రజలు నిరాశతో వెనుదిరుగుతున్నారు.
‘ఫీల్డ్ విజిట్’, ‘మీటింగ్’ల పేరుతో కాలయాపన..
కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు తదితర అత్యవసర పనుల కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు కార్యాలయంలో అధికారులు కనిపించకపోవడం నిత్యకృత్యంగా మారింది. కార్యాలయంలో కేవలం కంప్యూటర్ ఆపరేటర్, అటెండర్ మాత్రమే ఉండగా, వచ్చిన వారికి "సార్ ఫీల్డ్‌లో ఉన్నారు", "సమీక్షా సమావేశానికి వెళ్లారు" అనే సమాధానాలే వినిపిస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల కోసం గంటల తరబడి ఎదురుచూసినా పనులు కాకపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్నామని పలువురు వాపోతున్నారు. తాజాగా ఓ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా తన పని నిమిత్తం కార్యాలయానికి వచ్చి అధికారులు లేకపోవడంతో అసంతృప్తిగా వెనుదిరిగిన ఘటన అక్కడి పరిస్థితికి నిదర్శనంగా నిలిచింది.
కొత్త సర్కిళ్లలోనూ ఇదే పరిస్థితి..
కేవలం కీసర సర్కిల్‌లోనే కాకుండా ఇటీవల ఏర్పాటైన పలు కొత్త సర్కిల్ కార్యాలయాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నట్లు స్థానికులు చెబుతున్నారు. పాలనా సౌలభ్యం కోసం కొత్త కార్యాలయాలు ఏర్పాటు చేసినప్పటికీ, పూర్తిస్థాయిలో అధికారులు, సిబ్బందిని అందుబాటులో ఉంచడంలో యంత్రాంగం విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, కీసరతో పాటు కొత్తగా ఏర్పాటైన అన్ని సర్కిల్ కార్యాలయాల్లో అధికారులు విధి వేళల్లో తప్పనిసరిగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.






