- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కూల్ ఐడియా.. బిల్డింగ్‌పై నుంచి వానొస్తోంది.. చైనాలో హీట్‌వేవ్‌కు వినూత్న చెక్!
వేసవి ఎండల తీవ్రత, హీట్‌వేవ్‌ల నుంచి ఉపశమనం పొందేందుకు చైనాలోని ఓ నగరవాసులు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.

దిశ, డైనమిక్ బ్యూరో: వేసవి ఎండల తీవ్రత, హీట్‌వేవ్‌ల నుంచి ఉపశమనం పొందేందుకు చైనాలోని ఓ నగరవాసులు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. షాంగ్సీ ప్రావిన్స్‌లోని యున్‌చెంగ్ నగరంలో బహుళ అంతస్తుల అపార్ట్‌మెంట్లపై రూఫ్‌టాప్ ‘మిస్టింగ్ సిస్టమ్స్’ (నీటిని తుంపరలుగా మార్చి స్ప్రే చేసే యంత్రాలు) ఏర్పాటు చేశారు. భవనాల పైనుంచి ఈ సన్నని నీటి తుంపరలు కిందకు వర్షంలా పడుతుండటంతో రోడ్లు, వాక్‌వేస్ అన్నీ చల్లబడిపోతున్నాయి. మండుటెండల్లో సైతం చల్లటి వాతావరణం నెలకొనడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇది ఎలా పనిచేస్తుందంటే?
ఈ విధానం ‘ఎవాపరేటివ్ కూలింగ్’ (ఆవిరి ద్వారా చల్లబరచడం) అనే సైన్స్ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. భవనాల పైకప్పుల మీద ఉండే హై-ప్రెజర్ నాజిల్స్.. నీటిని అత్యంత సన్నని తుంపరలుగా గాలిలోకి వెదజల్లుతాయి. ఆ నీటి బిందువులు గాలిలో ఆవిరయ్యే క్రమంలో చుట్టూ ఉన్న వేడిని గ్రహిస్తాయి (చెమట పట్టినప్పుడు మన శరీరం చల్లబడే తరహాలో). బయట 38°C ఉష్ణోగ్రత ఉన్నప్పుడు, ఈ సిస్టమ్ ద్వారా కేవలం నిమిషాల వ్యవధిలోనే 5°C నుంచి 8°C మేర ఉష్ణోగ్రతలు తగ్గుతాయని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. తుంపరలు చాలా సన్నగా ఉండటం వల్ల అవి వెంటనే ఆవిరైపోతాయి, కాబట్టి రోడ్లు బురదగా మారడం కానీ, పాదచారులు తడిసిపోవడం కానీ జరగదు.
ఏసీల కంటే మెరుగు.. పర్యావరణానికి మేలు
సాధారణ ఏసీలతో పోలిస్తే ఈ సిస్టమ్‌కు కరెంటు ఖర్చు చాలా తక్కువ. కేవలం మోటార్లు, నాజిల్స్ పనిచేయడానికి మాత్రమే విద్యుత్ అవసరమవుతుంది. వాతావరణ మార్పుల కారణంగా ఏటా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, కాంక్రీట్ భవనాలు వేడిని గ్రహించడం వల్ల నగరాల్లో ఏర్పడుతున్న ‘అర్బన్ హీట్ ఐలాండ్’ ప్రభావాన్ని తగ్గించడానికి ఇదొక చక్కటి పరిష్కారం. కొందరు నిపుణులు నీటి వృథాపై ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ, ఈ తుంపరల వల్ల ఖర్చయ్యే నీరు చాలా తక్కువేనని నిర్వాహకులు చెబుతున్నారు. పెరుగుతున్న ఎండలను తట్టుకోవడానికి భవిష్యత్తులో నగరాలకు ఇలాంటి పర్యావరణ హితమైన, ఇంధనాన్ని ఆదా చేసే కూలింగ్ సిస్టమ్స్ ఎంతో అవసరమని అంతర్జాతీయంగా ప్రశంసలు దక్కుతున్నాయి. కూల్ ఐడియా అంటూ నెటిజన్‌లు మెచ్చుకుంటున్నారు.






