వర్షాకాలంలో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలి..

by Taduka Kalyani |   (  Updated:2026-07-02 13:48:23  IST  )

రాబోయే వర్షాకాలంలో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు.

వర్షాకాలంలో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలి..
X

దిశ, నిజాంసాగర్: రాబోయే వర్షాకాలంలో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు ముందస్తు చర్యలు చేపట్టి, ప్రాజెక్టు భద్రతతో పాటు నీటి నిర్వహణ పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించి ప్రస్తుత నీటి నిల్వలు, గేట్ల పరిస్థితి, ఖరీఫ్ సాగు నీటి విడుదల ప్రణాళిక, అలాగే ఏకో టూరిజం రూ "9.98 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు అధికారుల నుంచి నీటి నిల్వలపై పూర్తి వివరాలను తెలుసుకున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1405.00 అడుగులు (17.802 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 1394.70 అడుగుల వద్ద 6.653 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు.

ఖరీఫ్ సీజన్‌లో ఆయకట్టు రైతులకు సాగునీటి సరఫరా, నీటి విడుదల ప్రణాళికపై ఈఈ కెన్యా నాయక్‌ను అడిగి తెలుసుకున్న కలెక్టర్, నీటి వినియోగంలో సమర్థవంతమైన ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు. ప్రాజెక్టులోని గేట్ల పరిస్థితిని పరిశీలించి, అవసరమైన మరమ్మతులు, నిర్వహణ పనులను ఎప్పటికప్పుడు పూర్తి చేసి ఎలాంటి అత్యవసర పరిస్థితులనైనా సమర్థంగా ఎదుర్కొనేలా సిద్ధంగా ఉండాలని అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ.. వర్షాకాలంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేలా అధికారులు అప్రమత్తంగా ఉండాలి. ప్రాజెక్టు భద్రత విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం ఉండకూడదు.

నీటి నిల్వలు, గేట్ల నిర్వహణ, వరద నీటి విడుదల వంటి అంశాలపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలి. రైతులకు ఇబ్బందులు కలగకుండా సాగునీటి నిర్వహణకు ముందస్తు కార్యాచరణ సిద్ధం చేయాలి అని అన్నారు. అనంతరం నిజాంసాగర్ ప్రాజెక్టు వద్ద అభివృద్ధి చేస్తున్న ఏకో టూరిజం పనులను కలెక్టర్ పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న డీలక్స్ కాటేజీలు, సూట్ కాటేజీలు, స్పా, యోగా సెంటర్, రెస్టారెంట్, బాంక్వెట్ హాల్ తదితర నిర్మాణాలను సందర్శించి పనుల పురోగతిని సమీక్షించారు. పనులను నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు. నిజాంసాగర్‌ను రాష్ట్రంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. నిర్మాణ పనులను నాణ్యతతో పూర్తి చేసి, వచ్చే ఆగస్టు నెల నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. పర్యాటకులకు అన్ని సౌకర్యాలు కల్పించేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి అని కలెక్టర్ పేర్కొన్నారు.

నిజాంసాగర్ ఆయకట్టుకు సాగు నీటి విడుదలపై త్వరలోనే శివం కమిటీ సమీక్ష నిర్వహించనున్న సమీక్ష సమావేశం అనంతరం నీటి విడుదలపై తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐఏఎస్ రవితేజ, బాన్సువాడ ఆర్డీవో రవీందర్ రెడ్డి, డీఆర్డీఓ దామోదర్, జిల్లా టూరిజం అధికారి వెంకటేశ్వర్ గౌడ్, టూరిజం డీఈ విద్యాసాగర్, టూరిజం ఏఈ సోహెల్, ఈఈ కెన్యా నాయక్, మండల ప్రత్యేక అధికారి కుటుంబరావు, తహసీల్దార్ సాయి భుజంగరావు, ఎంపీడీవో శివకృష్ణ, ఎంఈఓ తిరుపతి రెడ్డి, ఎంపీఓ అనిత రెడ్డి, నీటిపారుదల శాఖ ఏఈలు సాకేత్, అక్షయ్, అధికారులు, డివిజన్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Next Story