క్రీడా పోటీల్లో తెలంగాణ TWMS స్కూలు సరికొత్త రికార్డులు

by Vemula.Srinu Prasad |

అడవి తల్లుల ఒడిలో సహజసిద్ధమైన నైపుణ్యాలతో పెరిగిన గిరిజన బిడ్డలు.. నేడు క్రీడా పోటీల్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. ట్రైబల్ వెల్ఫేర్ మోడల్ స్పోర్ట్స్ స్కూల్స్ వేదికగా అందుతున్న అత్యుత్తమ శిక్షణతో జాతీయ, అంతర్జాతీయ వేదికలపై తెలంగాణ కీర్తి పతాకాన్ని ఎగరేస్తున్నారు..

క్రీడా పోటీల్లో తెలంగాణ TWMS స్కూలు సరికొత్త రికార్డులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: అడవి తల్లుల ఒడిలో సహజసిద్ధమైన నైపుణ్యాలతో పెరిగిన గిరిజన బిడ్డలు.. నేడు క్రీడా పోటీల్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. ట్రైబల్ వెల్ఫేర్ మోడల్ స్పోర్ట్స్ స్కూల్స్ వేదికగా అందుతున్న అత్యుత్తమ శిక్షణతో జాతీయ, అంతర్జాతీయ వేదికలపై తెలంగాణ కీర్తి పతాకాన్ని ఎగరేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం గిరిజన విద్యార్థులలోని క్రీడా నైపుణ్యాలను గుర్తించి, వారిని అంతర్జాతీయ ఛాంపియన్లుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ మోడల్ స్పోర్ట్స్ స్కూళ్లను నడుపుతోంది. ఫలితంగా సంప్రదాయ క్రీడల నుంచి ఆధునిక క్రీడల వరకు అన్నింటిలోనూ గిరిజన విద్యార్థులు మేటిగా రాణిస్తున్నారు. అథ్లెటిక్స్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, హ్యాండ్‌బాల్, బాస్కెట్‌బాల్, హాకీ, ఫెన్సింగ్, ఆర్చరీ క్రీడల్లో ట్రైబల్ వెల్ఫేర్ మోడల్ స్పోర్ట్స్ స్కూల్స్‌లో ట్రైనింగ్ ఇస్తున్నారు.

వాటర్ స్పోర్ట్స్ స్కూల్ స్పెషల్..

ట్రైబల్ వెల్ఫేర్ మోడల్ స్పోర్ట్స్ స్కూల్స్‌లో వాటర్ స్పోర్ట్స్ ప్రత్యేకంగా నిలుస్తోంది. సాధారణంగా ఖరీదైన క్రీడలుగా భావించే కాయాకింగ్, కేనోయింగ్, రోయింగ్ వంటి వాటర్ స్పోర్ట్స్‌లో గిరిజన విద్యార్థులు అద్భుతాలు సృష్టిస్తున్నారు. హుస్సేన్‌సాగర్ వేదికగా నిపుణులైన కోచ్‌ల పర్యవేక్షణలో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. అలలపై అద్భుతాలు చేస్తూ.. వారు సాధిస్తున్న పతకాలు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. దీంతో ఒకప్పుడు కేవలం గిరిజన తండాలకే పరిమితమైన ఈ పిల్లలు, నేడు జాతీయ స్థాయి ఖేలో ఇండియా, నేషనల్ గేమ్స్‌తో పాటు అంతర్జాతీయ టోర్నమెంట్లలో పతకాలు సాధిస్తూ దేశానికే గర్వకారణంగా మారుతున్నారు.

7 స్కూల్స్.. 240 మంది స్టూడెంట్స్

తెలంగాణలో మొత్తం 7 ట్రైబల్ వెల్ఫేర్ మోడల్ స్పోర్ట్స్ స్కూల్స్ ఉన్నాయి. భద్రాచలం ఐటీడీఏ పరిధిలో కాంచనపల్లి (గర్ల్స్), కిన్నెరసాని (బాయ్స్), ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలో కొత్తగూడ (బాయ్స్), ఉట్నూరు ఐటీడీఏ పరిధిలో ఉట్నూరు (బాయ్స్), జాతర్ల (బాయ్స్), ఆసిఫాబాద్ (గర్ల్స్), ప్లేన్ ఐటీడీఏ పరిధిలో హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లిలో వాటర్ స్పోర్ట్స్ అకాడమీ ఉంది. వీటిల్లో క్రీడల్లో శిక్షణ తోపాటు విద్య, వసతి కల్పిస్తున్నారు. 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. 7 స్పోర్ట్స్ స్కూళ్లలో మొత్తం 240 మంది విద్యార్థులకు ట్రైనింగ్ ఇస్తున్నారు. వీరికి స్పెషల్ డైట్ సహా.. అన్నింటినీ ప్రభుత్వమే సమకూరుస్తుంది. వీటిల్లో చదివే విద్యార్థులు అటు క్రీడల్లో, ఇటు పరీక్షల్లోనూ ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నారు.

పోటీ ఏదైనా పతకం వీరిదే..

ట్రైబల్ వెల్ఫేర్ మోడల్ స్పోర్ట్స్ స్కూళ్లలో ట్రైనింగ్ తీసుకున్న విద్యార్థులు.. అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో జరిగిన వివిధ క్రీడా పోటీల్లో వందలాది పతకాలు సాధించారు. వాటర్ స్పోర్ట్స్‌లో మొత్తం 458 పతకాలు సాధించారు. ఇంటర్నెషనల్ లెవెల్‌లో 5 (1 సిల్వర్, 4 బ్రౌంజ్) మెడల్స్ సాధించారు. కేవలం 2025-26 విద్యా సంవత్సరంలోనే వివిధ క్రీడా పోటీల్లో నేషనల్ లెవెల్‌లో 145 గోల్డ్, 199 సిల్వర్, 73 బ్రౌంజ్ మెడల్స్ సాధించారు. వీటిని సాధించిన విద్యార్థులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించి, నగదు బహుమతి అందజేశారు. మరిన్ని అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలకు వెళ్లేలా విద్యార్థులను తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు.

అప్‌గ్రేడ్ చేయాలి..

ట్రైబల్ వెల్ఫేర్ మోడల్ స్పోర్ట్స్ స్కూళ్లలో ప్రస్తుతం పదో తరగతి వరకే చదువుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇంటర్, డిగ్రీలో చేరాలనుకునే విద్యార్థులకు ఇలా క్రీడల్లో అత్యుత్తమ శిక్షణ ఇచ్చే విద్యా సంస్థలు లేవు. దీంతో విద్యార్థులు వెనకబడుతున్నారు. అందుకే.. ఈ స్కూళ్లను ఇంటర్, డిగ్రీ వరకు అప్‌గ్రేడ్ చేయాలని స్టూడెంట్స్ కోరుతున్నారు. అలా చేస్తే.. జూనియర్, సీనియర్ పోటీల్లోనూ పాల్గొనే అవకాశం తమకు వస్తుందని విద్యార్థులు చెబుతున్నారు.

Next Story