- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జిల్లాలో 221 మహిళా సంఘాల భవనాలు
తెలంగాణ ప్రభుత్వం మహిళా మణులను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో వారికి అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పిస్తోంది.

దిశ, వికారాబాద్ ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం మహిళా మణులను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో వారికి అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పిస్తోంది. జీరో వడ్డీ రుణాలు అందిస్తూ, వివిధ వ్యాపారాలు చేసుకునేలా అవకాశాలు కల్పిస్తూ వారి అభివృద్ధికి బాటలు వేస్తోంది. అందులో భాగంగా మహిళా సంఘాలకు ప్రభుత్వం భవనాలు మంజూరు చేసి అవసరమైన సౌకర్యాలను కల్పిస్తోంది. వికారాబాద్ జిల్లాలో రూ.22.1 కోట్లతో 221 మహిళా సంఘాల భవనాల నిర్మాణాలకు మంజూరు లభించింది. ఇందులో ఇప్పటివరకు నాలుగు భవనాలు పూర్తికాగా, 186 భవనాలు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. మరో 31 భవనాలకు పనులు ప్రారంభించాల్సి ఉంది. ఇప్పటివరకు రూ.5.41 కోట్లు ఖర్చు చేసి నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారు. వికారాబాద్ జిల్లాలో మహిళా సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసి, మహిళా సంఘాల ద్వారా వివిధ వ్యాపారాలు చేసుకునేలా వెసులుబాటు కల్పించింది. అందులో భాగంగా మహిళా క్యాంటీన్లు ఏర్పాటు చేసి మహిళలు స్వయం ఉపాధి దిశగా ముందుకు సాగుతున్నారు.
అదేవిధంగా, మహిళా సంఘాల ద్వారా జిల్లాలో ఇప్పటికే ఏడు బస్సులను కొనుగోలు చేసి, ఆర్టీసీ ఆధ్వర్యంలో మహిళా సంఘాల నిర్వహణలో సేవలందిస్తున్నారు. వాటి ద్వారా వచ్చే ఆదాయం మహిళా సంఘాల ఖాతాల్లో జమ అవుతుండడంతో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు. మహిళలను మరింత ప్రోత్సహించేలా జిల్లాలో మహిళా సంఘాలకు రెండు పెట్రోల్ బంకులను కూడా మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెట్రోల్ బంకుల నిర్వహణ ద్వారా వారికి లాభాలు చేకూరి, మహిళా సంఘాల అభివృద్ధికి దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం స్థల సేకరణ పనులు కూడా కొనసాగుతున్నాయి. మహిళా సంఘాలను అన్ని విధాలుగా ప్రోత్సహించే ఉద్దేశంతో ఆయా గ్రామాల్లో వారికి సొంత భవనాలు ఉండేలా 221 భవనాల నిర్మాణం చేపట్టారు. ఈ పనులన్నింటినీ నవంబర్ నాటికి పూర్తి చేసి మహిళా సంఘాలకు అప్పగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
మహిళా సంఘాల భవనాలు నవంబర్ నాటికి పూర్తి చేస్తాం : పంచాయతీరాజ్ ఈఈ ఉమేష్
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహిళా సంఘాల అభివృద్ధిని ప్రోత్సహించే ఉద్దేశంతో నిర్మిస్తున్న మహిళా సంఘాల భవనాలను నవంబర్ నాటికి పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నామని పంచాయతీరాజ్ ఈఈ ఉమేష్ తెలిపారు. మహిళా సంఘాల భవనాల్లో అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తూ, నాణ్యతతో పనులు చేపడుతున్నామని చెప్పారు. ఇప్పటికే నాలుగు భవనాలు పూర్తయ్యాయని, మరో 31 భవనాలకు పనులు ప్రారంభం కావాల్సి ఉందని, వాటన్నింటినీ త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.






