అరేబియా సముద్రంలో నేవీ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్: ముగ్గురు సేఫ్.. ఒకరు గల్లంతు

by Ramesh Naini |

అరేబియా సముద్రంలో గస్తీ నిర్వహిస్తున్న అమెరికా నేవీకి చెందిన ఎంహెచ్‌-60ఎస్‌ సీహాక్‌ హెలికాప్టర్‌ బుధవారం తెల్లవారుజామున నీటిపై అత్యవసరంగా ల్యాండ్ అయింది.

అరేబియా సముద్రంలో నేవీ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్: ముగ్గురు సేఫ్.. ఒకరు గల్లంతు
X

దిశ, డైనమిక్ బ్యూరో: అరేబియా సముద్రంలో గస్తీ నిర్వహిస్తున్న అమెరికా నేవీకి చెందిన ఎంహెచ్‌-60ఎస్‌ (MH-60S) సీహాక్‌ హెలికాప్టర్‌ బుధవారం తెల్లవారుజామున నీటిపై అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఈ ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో నలుగురు సిబ్బంది ఉండగా.. ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతైన మరో వ్యక్తి కోసం అమెరికా దళాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఈ సీహాక్ హెలికాప్టర్‌ను అమెరికాకు చెందిన భారీ విమానవాహక నౌక ‘యూఎస్‌ఎస్‌ జార్జ్‌ హెచ్‌డబ్ల్యూ బుష్‌’ (USS George H.W. Bush) పైనుంచి మోహరించారు. ప్రమాద సమయంలో నలుగురు క్రూ మెంబర్స్ ఉండగా, ముగ్గురిని రక్షించారు. ప్రస్తుతం వారు క్యారియర్‌పై వైద్యుల పర్యవేక్షణలో సురక్షితంగా ఉన్నారు. తప్పిపోయిన మరో వ్యక్తి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.

పైలట్లకు కత్తిమీద సామే!

ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు శత్రు దాడులకు సంబంధం లేదని, ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలపై దర్యాప్తు ప్రారంభించామని అమెరికా నేవీ ఫిఫ్త్‌ ఫ్లీట్‌ (U.S. 5th Fleet) స్పష్టం చేసింది. సముద్ర జలాలపై హెలికాప్టర్‌ ల్యాండింగ్‌ చేయడం అత్యంత ప్రతిభావంతులైన పైలట్లకు సైతం కత్తిమీద సామే. హెలికాప్టర్‌ పైభాగం బరువుగా ఉండటం వల్ల అవి నీటిలో తల్లకిందులయ్యే ప్రమాదం చాలా ఎక్కువ అని నిపుణులు చెబుతున్నారు.

గత ఘటనలు..

ఇదే ఏడాది జూన్‌లో హర్మూజ్‌ జలసంధి సమీపంలో అమెరికాకు చెందిన అపాచీ హెలికాప్టర్‌ కూడా ఇలాగే నీటిలో కుప్పకూలింది. అప్పట్లో ఇద్దరు పైలట్లు సురక్షితంగా ప్రాణాలతో బయటపడగా.. అదే సమయంలో తాము ఒక అమెరికా డ్రోన్‌ను కూల్చినట్లు ఇరాన్‌ ప్రకటించడం పలు అనుమానాలకు తావిచ్చింది. నాటి ఘటన మరువకముందే ఇప్పుడు మరో హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్ కావడం గమనార్హం.

Next Story