Google: గూగుల్‌కు యూరప్ కోర్టులో భారీ ఎదురుదెబ్బ

by S Gopi |

2018లో యూరోపియన్ కమిషన్ తొలుత 4.34 బిలియన్ యూరోల జరిమానా విధించగా, 2022లో దిగువ కోర్టు దాన్ని 4.1 బిలియన్ యూరోలకు తగ్గించింది.

Google: గూగుల్‌కు యూరప్ కోర్టులో భారీ ఎదురుదెబ్బ
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఉపయోగించి తన ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేసిందన్న కేసులో గూగుల్‌కు యూరప్‌లో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఎనిమిదేళ్లుగా కొనసాగుతున్న ఈ న్యాయపోరులో యూరోపియన్ యూనియన్ అత్యున్నత న్యాయస్థానం గూగుల్ అప్పీల్‌ను తిరస్కరిస్తూ, కంపెనీపై విధించిన 4.1 బిలియన్ యూరోల (మన కరెన్సీలో సుమారు రూ.40 వేల కోట్లకు పైగా) జరిమానాను ఖరారు చేసింది. 2018లో యూరోపియన్ కమిషన్ తొలుత 4.34 బిలియన్ యూరోల జరిమానా విధించగా, 2022లో దిగువ కోర్టు దాన్ని 4.1 బిలియన్ యూరోలకు తగ్గించింది. అయితే ఆ నిర్ణయాన్ని కూడా గూగుల్ సవాలు చేయగా, ఇప్పుడు అత్యున్నత కోర్టు కమిషన్ నిర్ణయానికే మద్దతు ఇచ్చింది. ఆండ్రాయిడ్ ఫోన్లలో గూగుల్ సెర్చ్, క్రోమ్ బ్రౌజర్, గూగుల్ ప్లే స్టోర్‌ను ముందుగానే ఇన్‌స్టాల్ చేయాలని ఫోన్ తయారీదారులను ఒప్పందాల ద్వారా బలవంతం చేయడం, ప్రత్యామ్నాయ ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌లకు అవకాశాలను పరిమితం చేయడమే ఈ కేసులో ప్రధాన ఆరోపణ.

తీర్పుపై స్పందించిన గూగుల్, ఆండ్రాయిడ్‌ను ఓపెన్, ఉచిత, అందరికీ అందుబాటులో ఉండే ప్లాట్‌ఫామ్‌గా అభివృద్ధి చేయడానికి తాము చేసిన పెట్టుబడులను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదని పేర్కొంది. అయితే 2018లో వచ్చిన యూరోపియన్ కమిషన్ నిర్ణయం తర్వాత తమ వ్యాపార ఒప్పందాలను ఇప్పటికే సవరించామని, వినియోగదారులు, భాగస్వాములు, డెవలపర్ల కోసం కొత్త ఆవిష్కరణలపై దృష్టి కొనసాగిస్తామని తెలిపింది. గత దశాబ్దంలో వివిధ యాంటీట్రస్ట్ కేసుల్లో గూగుల్‌పై దాదాపు 11 బిలియన్ యూరోల జరిమానాలు విధించిన యూరోపియన్ యూనియన్, బిగ్ టెక్ కంపెనీలపై మరింత కఠిన వైఖరిని కొనసాగిస్తోంది.

Next Story