కోర్టునూ తప్పుదారిపట్టించిన ఏఐ

by velandi.Saikiran |

ఏఐ ఏకంగా కోర్టునే తప్పుదారిపట్టించింది. తమ వాదనల కోసం డిఫెన్స్‌గా అడ్వకేట్లు పాత కేసుల తీర్పులను ఉల్లేఖిస్తుంటారు.

కోర్టునూ తప్పుదారిపట్టించిన ఏఐ
X

కోర్టునూ తప్పుదారిపట్టించిన ఏఐ

- లేని కేసులను ఉన్నట్టుగా, లేని తీర్పులను ఉన్నట్టు చిత్రించిన ఏఐ

- ఆ వివరాలతో ఎన్‌సీఎల్‌టీలో అడ్వకేట్ వాదనలు

- ఉనికిలోలేని కేసుల సైటేషన్‌ ఆధారంగా తీర్పునిచ్చిన ట్రిబ్యునల్

- తీర్పు పక్కనపెట్టిన సుప్రీంకోర్టు.. ఏఐ వినియోగంపై దర్యాప్తు చేయాలని బార్‌కు ఆదేశం

దిశ, నేషనల్ బ్యూరో: ఏఐ ఏకంగా కోర్టునే తప్పుదారిపట్టించింది. తమ వాదనల కోసం డిఫెన్స్‌గా అడ్వకేట్లు పాత కేసుల తీర్పులను ఉల్లేఖిస్తుంటారు. న్యాయమూర్తులు కూడా ఇచ్చే తీర్పులో పాత కేసుల జడ్జిమెంట్‌లను ప్రస్తావిస్తుంటారు. ఎన్‌సీఎల్‌టీ వెలువరించిన ఓ తీర్పులోనూ ఇలా పాత కేసులున్నాయి. అయితే, అందులో కొన్ని కేసుల వివరాలు పరిశీలిస్తే అవి అసలు లేనేలేవు. ఇదివరకెప్పుడే ఏ కోర్టూ ఇవ్వని తీర్పులను ఇచ్చినట్టుగా ఆ తీర్పులో ఉన్నాయి. ఇందుకు కారణం ఏఐ. అడ్వకేట్లు ఏఐ క్రియేట్ చేసిన కేసు ప్రిసిడెంట్లను ఉల్లేంఖించగా.. వాటిని వెరిఫై చేయకుండా న్యాయమూర్తులు స్వీకరించారు. అలా ఏఐ అడ్వకేట్లను, న్యాయమూర్తులను తప్పుదారి పట్టించింది. దీంతో సుప్రీంకోర్టు ఈ తీర్పును పక్కనపెట్టేసింది. అలాగే, న్యాయ విచారణలో ఏఐ వినియోగాన్ని పరీక్షించాలని, అందుకు ఓ ప్రత్యేక కమిటీ వేయాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఆదేశించింది.

జీరో టాలరెన్స్

ఎస్సెల్ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్ దివాలా కేసులో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్‌సీఎల్‌టీ) ఏఐ జెనరేట్ చేసిన లేని నకిలీ తీర్పులు, ఫేక్ జడ్జిమెంట్లు, ప్రిసిడెంట్ల ఆధారంగా తీర్పు వెలువరించిందని, ఆ తీర్పును పక్కనపెడుతున్నట్టు సుప్రీంకోర్టు పేర్కొంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పీఎస్ నరసింహా, అలోక్ అరాధెల ధర్మాసనం ఈ కేసు విచారిస్తూ ఇలా ఫేక్ కేసుల వివరాలపై ఆధారపడితే మొత్తం న్యాయవిచారణ సమగ్రతకే దెబ్బ వస్తుందని, ఏఐ క్రియేట్ చేసిన నకిలీ కేసు వివరాలను డీల్ చేసేటప్పుడు జీరో టాలరెన్స్ ఉండాలని సూచించింది. అడ్వకేట్లకూ ఈ పొరపాటులో భాగముందని పేర్కొంది. ‘ఆ తీర్పులో ఈ నకిలీ కేసుల పాత్ర ఉన్నా లేకున్నా చట్టం దృష్టిలో ఆ నిర్ణయాలు నిర్ణయాలే కావు. నామమాత్రమైనా ఫేక్ లేదా తప్పుడు సమాచారం నిర్ణాయక ప్రక్రియలో చేరినప్పుడు అది న్యాయవివచారణ పవిత్రత, సమగ్రతనే దెబ్బతీస్తుంది’ అని వివరించింది.

ఏఐ మనల్ని కాదు.. మనమే దాన్ని కంట్రోల్ చేయాలి

న్యాయ విచారణలో ఏఐ సహాయాన్ని తీసుకోవడంపై ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. సహాయకారిగా, ఒక టూల్‌గా ఏఐని వినియోగించుకోవచ్చని, కానీ, ఆ న్యాయ నిర్ణయంలో పూర్తిగా మనిషి నియంత్రణలోనే ఉండాలని, ప్రతి దశలో సంపూర్ణంగా ఉండాలని వివరించింది. ఏఐ కేవలం సహాయానికే పరిమితం కావడం లేదని, నేడు రోజువారీ పనులు, మేధోపరమైన కృషిని కూడా ఏఐ చేస్తున్నదని తెలిపింది. ప్రస్తుత బిజీ లైఫ్‌లో ప్రొఫెషనల్స్ ఏఐ వినియోగంవైపు మొగ్గవచ్చని, దాని ఫలితంగా అద్భుతంగా ఉండొచ్చని పేర్కొంది. కానీ, దాన్ని ఎలాంటి నియంత్రణ లేకుండా వదిలిపెడితే మేధోపరమైన పనిలోనికీ చొచ్చుకొచ్చి వృత్తిగత నైతికతను భంగం చేయవచ్చని, చివరికి ప్రొఫెషనల్స్‌నే దానిపై ఆధారపడేలా చేసుకోగలదని తెలిపింది.

కమిటీ వేసి దర్యాప్తు చేయండి..

ఏఐ టెక్నాలజీ ఇప్పుడిప్పుడే పరిణమిస్తున్నదని, ఇది కేవలం మనకు సహాయమే కాదని.. మనిషి సొంత ఆలోచన, హేతుబద్ధత, నిర్ణయాలు తీసుకోవడంలోనూ మనుషులకు ప్రత్యా్మ్నాయంగా ఎదగొచ్చని ధర్మాసనం వివరించింది. న్యాయ విచారణ ప్రక్రియలో, డెసిషన్ మేకింగ్‌లోనూ ఎవరూ ఎరగనట్టుగానే ఏఐ చొచ్చుకురావొచ్చని హెచ్చరించింది. దాన్ని గుర్తించేలోగానే జరగాల్సిన దారుణం జరిగిపోతుందని, అది మొత్తం న్యాయవిచారణలోని ఆత్మనే నాశనం చేయొచ్చని తెలిపింది. ఇదే సందర్భంలో ఏఐ వినియోగంపై, ఈ సమస్యలపై ప్రత్యేక కమిటీ వేసి అధ్యయనం చేయాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఆదేశించింది.

ఎన్‌సీఎల్‌టీ తీర్పిచ్చిన కేసు ఏమిటి?

పాన్ ఇండియా యుటిలిటీస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్‌కు జమ్ము కశ్మీర్ బ్యాంక్ రూ. 200 కోట్ల రుణమిచ్చింది. ఇందుకు ఎస్సెల్ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్ కార్పొరేట్ గ్యారంటీ, ముంబైలోని గొరాయ్, బొరివలీ భూములను తనఖా పెట్టుకుంది. అయితే, తమ ఆస్తులన్నీ వేరే గ్రూపులో విలీనం చేశామని, ఆ తర్వాత ఆ గ్రూపును బాంబే హైకోర్టు 2014లో ఆమోదించింది కూడా అని ఎస్సెల్.. ఎన్‌సీఎల్‌టీలో వాదించింది. అయితే, కార్పొరేట్ గ్యారంటీకి కట్టుబడి ఉండాల్సిందేనని ఎన్‌సీఎల్‌టీ బెంచ్ తీర్పునిచ్చింది. దీన్ని ఎన్‌సీఎల్‌ఏటీ కూడా సమర్థించింది. ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలవ్వగా ఈ వ్యవహారం బయటికొచ్చింది. ఈ తీర్పున పక్కనపెట్టిన సుప్రీంకోర్టు వాస్తవ అంశాల ఆధారంగా కేసును డిసైడ్ చేయాలని తాజాగా ఎన్‌సీఎల్‌టీని ఆదేశించింది.

Next Story