- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫ్లవర్ కావాలని వాట్సాప్ చేస్తే 48 గంటల్లో గంజాయి మీ ఇంటికే..!
స్నేహితుడు ఇచ్చిన ఐడియాతో అక్రమ గంజాయి దందాను స్పీడ్ పోస్ట్ ద్వారా దేశవ్యాప్తంగా విస్తరించిన జార్ఖండ్ ముఠా గుట్టును గురువారం హైదరాబాద్ హెచ్-న్యూ పోలీసులు బయటపెట్టారు.

దిశ, సిటీ క్రైమ్ : స్నేహితుడు ఇచ్చిన ఐడియాతో అక్రమ గంజాయి దందాను స్పీడ్ పోస్ట్ ద్వారా దేశవ్యాప్తంగా విస్తరించిన జార్ఖండ్ ముఠా గుట్టును గురువారం హైదరాబాద్ హెచ్-న్యూ పోలీసులు బయటపెట్టారు. ఈ ముఠా నాయకుడిని పోలీసులు అరెస్టు చేశారు. బంజారాహిల్స్ టీజీఐసీసీసీ భవనంలో పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని గుడిమల్కాపూర్, ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల పోలీసులు సుశాంత్ వ్యాస్, లడ్డూలను అరెస్టు చేసి రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయి ఎక్కడి నుంచి వచ్చిందని ఆరా తీయగా, స్పీడ్ పోస్ట్ ద్వారా వచ్చిందని తెలిసింది. దీంతో హెచ్-న్యూ ఇన్‌స్పెక్టర్ బాలస్వామి ఆధ్వర్యంలో మొత్తం 22 మంది పోలీసు సిబ్బందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ రఘునాథ్ గైక్వాడ్ పర్యవేక్షణలో స్పీడ్ పోస్ట్ గంజాయి దందా పై ఆపరేషన్ ప్రారంభించారు.
జార్ఖండ్ కేంద్రంగా అక్రమ దందా..
జార్ఖండ్‌లోని గిరిధి జిల్లా, నిమ్రాయాఘాట్ మండలం, తంబగుడియో గ్రామానికి చెందిన సత్యం మిశ్రా ఇంటర్మీడియట్ వరకు చదివాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువును మధ్యలోనే ఆపేసి లారీ డ్రైవర్, ఆటో డ్రైవర్, పెయింటర్‌గా పనిచేశాడు. ముంబయికి పలుమార్లు వెళ్లిన సమయంలో అక్కడ కొంతకాలం పనిచేస్తూ గంజాయికి అలవాటు పడ్డాడు. అనంతరం ఈ దందా చేస్తే భారీ లాభాలు వస్తాయని గుర్తించాడు. దీంతో తన సోదరుడు శుభం మిశ్రా, బంధువులు, స్నేహితులు రాహుల్ ఝా, సచిన్ మిశ్రా, సంతోష్ పండిత్‌లతో కలిసి ఒక ముఠాను ఏర్పాటు చేసుకున్నాడు.
21 రాష్ట్రాలకు గంజాయి సరఫరా..
సత్యం మిశ్రా ముందుగా జార్ఖండ్‌లో గంజాయిని పండించే వారితో, సరఫరా చేసే వారితో పరిచయాలు పెంచుకుని వారి నుంచి గంజాయిని సేకరించడం ప్రారంభించాడు. అనంతరం ఓ స్నేహితుడు ఇచ్చిన ఐడియాతో గంజాయిని స్పీడ్ పోస్ట్ ద్వారా సరఫరా చేయాలని ప్రణాళిక రూపొందించాడు. దీని కోసం జార్ఖండ్‌లోని ఇస్త్రీ బజార్, పుస్రో బజార్ పోస్టాఫీసులను ఎంచుకున్నాడు. ఈ పోస్టాఫీసుల నుంచి మందులు సరఫరా చేస్తున్నామని పోస్టాఫీస్ అధికారులను నమ్మించి, గంజాయిని స్పీడ్ పోస్ట్ ద్వారా దాదాపు 21 రాష్ట్రాలకు ఈ ముఠా సరఫరా చేస్తోంది.
ఏడాదికి రూ.5 కోట్ల సంపాదన..
స్పీడ్ పోస్ట్ ద్వారా ఈ ముఠా 50 గ్రాముల నుంచి 250 గ్రాముల వరకు గంజాయిని ప్యాకెట్లుగా మార్చి సరఫరా చేస్తోంది. వీటిని రూ.1,500 నుంచి రూ.8,000 వరకు విక్రయిస్తున్నారు. ఇలా ఈ ముఠా నెలకు సుమారు రూ.50 లక్షలు, ఏడాదికి రూ.5 కోట్ల వరకు సంపాదిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఒక్క ముంబయిలోనే ఈ ముఠాకు వెయ్యి మంది కస్టమర్లు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది.
గంజాయికి కోడ్ వర్డ్స్ 'ఫ్లవర్', 'మ్యాంగో'..
ఈ ముఠా మొత్తం అక్రమ గంజాయి దందాను వాట్సాప్ ద్వారానే నిర్వహిస్తోంది. దీని కోసం 'మ్యాంగో', 'ఫ్లవర్', 'స్టిక్' పేర్లను కోడ్ వర్డ్స్‌గా ఉపయోగిస్తున్నారు. వినియోగదారుల నుంచి ముందుగానే డబ్బులు తీసుకున్న తర్వాత గంజాయిని స్పీడ్ పోస్ట్ ద్వారా విమానాలు, రైళ్లు, ఇతర మార్గాల ద్వారా వినియోగదారుల వద్దకు చేరవేస్తున్నారు. ఈ ముఠాకు అధికంగా ముంబయిలో కస్టమర్లు ఉండటంతో అక్కడ ఓ మురికివాడను కేంద్రంగా ఎంచుకుని ముఠా సభ్యులను నియమించారు. స్పీడ్ పోస్ట్ ద్వారా అక్కడికి భారీగా గంజాయిని పంపించి, అక్కడి నుంచి నేరుగా కస్టమర్లకు చేరవేస్తున్నారు. ఇలా రోజుకు 80 నుంచి 100 పార్సిళ్ల వరకు స్పీడ్ పోస్ట్ ద్వారా గంజాయిని సరఫరా చేస్తున్నట్లు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా ఆర్థిక లావాదేవీల కోసం యూపీఐతో పాటు వారికి తెలిసిన బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేయించుకుని, ముఠాలోని సభ్యులు తమ స్థాయిని బట్టి వాటిని పంచుకుంటున్నారు. ఈ ముఠా స్పీడ్ పోస్ట్ ద్వారా నిర్వహిస్తున్న గంజాయి దందా గురించి కేంద్ర నిఘా సంస్థలతో పాటు ఇతర రాష్ట్రాల పోలీసులకు కూడా హైదరాబాద్ పోలీసులు సమాచారం ఇచ్చి అప్రమత్తం చేశారు. తాజా ఘటన వెలుగులోకి రావడంతో కొరియర్ ఏజెన్సీలన్నీ తమ వద్దకు వచ్చే పార్సిళ్లను తప్పనిసరిగా తనిఖీ చేయాలని సూచించినట్లు సీపీ సజ్జనార్ తెలిపారు.
బంగారం, ఖరీదైన కార్లు..
ఈ ముఠా అక్రమ గంజాయి ద్వారా సంపాదించిన డబ్బును విలాసవంతమైన జీవితానికి ఖర్చు చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. బంగారం, ఖరీదైన కార్లు, ఇతర విలాస వస్తువుల కొనుగోలుకు ఈ సొమ్మును వినియోగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ముఠా నాయకుడు సత్యం మిశ్రాను అరెస్టు చేయగా, మిగిలిన నలుగురు పరారీలో ఉన్నారు. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని సీపీ తెలిపారు. దేశవ్యాప్త నెట్‌వర్క్‌ను ఛేదించిన పోలీసులను ఆయన అభినందించారు. అక్రమ గంజాయి, డ్రగ్స్ దందా గురించి సమాచారం ఉంటే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని సీపీ కోరారు. అలాగే ఈ ముఠా అక్రమ గంజాయి దందా ద్వారా సంపాదించిన ఆస్తులను త్వరలోనే జప్తు చేసేందుకు దర్యాప్తును ముమ్మరం చేశామని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు.






