సీఎం, మంత్రులు తొడగొట్టి తోకముడిచారు.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

by Ajay Maddhiboyina |

అప్పులపై చర్చకు సిద్ధమని సవాళ్లు విసిరిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు తీరా సమయం వచ్చేసరికి తోకముడిచి పారిపోయారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

సీఎం, మంత్రులు తొడగొట్టి తోకముడిచారు.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: అప్పులపై చర్చకు సిద్ధమని సవాళ్లు విసిరిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు తీరా సమయం వచ్చేసరికి తోకముడిచి పారిపోయారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సవాల్ విసిరి చేతకాక పారిపోయిన ఈ సన్నాసుల బాగోతాన్ని రాష్ట్ర ప్రజలంతా కళ్లారా చూశారని మండిపడ్డారు. తానే స్వయంగా తెలంగాణ భవన్‌కు వస్తున్నానని ప్రగల్బాలు పలికిన మంత్రి జూపల్లి కృష్ణారావు కోసం ప్రత్యేకంగా కుర్చీ వేసి, శాలువాతో మూడు గంటలపాటు వేచి చూసినా రాలేదని అన్నారు. మంత్రి రాకుండా మొహం చాటేయడంతోపాటు మరో చోట డ్రామాకు తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి గన్ పార్క్ వద్ద చర్చకు సిద్ధమై బయలుదేరిన హరీశ్‌రావును, ఇతర నేతల్ని అరెస్టు చేయడం, మమ్ములను అడుగడుగునా అడ్డుకోవడం సిగ్గుచేటని ఫైర్ అయ్యారు. అక్కడ కూర్చుని మంత్రులు సవాళ్లు విసరడం, ఇక్కడ పోలీసులను పెట్టి అడ్డుకోవడం ఈ ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమని దుయ్యబట్టారు. కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్‌కు తరలించిన నేతలను పరామర్శించేందుకు కూడా వెళ్లకుండా అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమతో చర్చించే దమ్ము ఈ పిరికిపందలకు లేదని అన్నారు.

అసెంబ్లీ పెడితే సర్కారు బండారం బయటపెడతాం

సీఎం, మంత్రులకు నిజంగానే చర్చించే దమ్ముంటే వెంటనే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని కేటీఆర్ సవాల్ విసిరారు. సభలో మైక్ కట్ చేయకుండా తమకు మాట్లాడే అవకాశం ఇస్తే ఈ ప్రభుత్వ రెండున్నరేళ్ల డొల్లతనాన్ని, అవినీతి బండారాన్ని మొత్తం బట్టబయలు చేస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన అబద్ధపు హామీలు, పరిపాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రభుత్వం నిత్యం ప్రయత్నిస్తుదని.. ఇలాంటి శిఖండి రాజకీయాలను తెలంగాణ ప్రజలు అస్సలు సహించరని హెచ్చరించారు. రెండున్నరేళ్లలో అనుముల బ్రదర్స్ రాష్ట్రాన్ని నిలువునా దోచుకున్నారని.. అదానిని మించిన ఆస్తులు కూడబట్టారని ఆరోపించారు. ఎక్సైజ్ శాఖలో హోలోగ్రామ్ టెండర్లలో మంత్రి కొడుకు, సీఎం అల్లుడి పంచాయతీ భరించలేకే ఐఏఎస్ అధికారి రిజ్వీ రాజీనామా చేశారని, బీర్ల కోసం తెచ్చిన జీఓపై జూపల్లికి కనీస అవగాహన లేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పాలనలో కేవలం రూ.2.80 లక్షల కోట్ల అప్పు చేసిందని ఆర్బీఐ, కాగ్ లెక్కలు చెబుతుంటే, సీఎం, డిప్యూటీ సీఎంలు పొంతన లేని కాకి లెక్కలతో ప్రజలను మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఆర్ఆర్ టాక్స్ వసూలు చేస్తున్నారని స్వయంగా ప్రధానమంత్రి మాట్లాడినా, ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని బీజేపీని ప్రశ్నించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై జరిగిన ఈడీ దాడుల విచారణ ఏమైందో బండి సంజయ్ సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు, చీకటి ఒప్పందాలు ప్రజలకు అర్థమైపోయాయని అన్నారు. సీఎం, మంత్రులు ఇవాళ పారిపోయినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని, నాలుగు కోట్ల ప్రజల పక్షాన నిత్యం ప్రజాక్షేత్రంలో నిలదీస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.

Next Story