సీట్ల కోసం పాట్లు.. ఆఫీసర్ల కోసం పడిగాపులు!

by Ajay Maddhiboyina |

రాష్ట్రంలోని మహాత్మా జ్యోతిభాఫూలే గురుకుల సొసైటీ విద్యా సంస్థల్లో సీట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో గురుకులాల్లో ఆడ్మిషన్ల కోసం విద్యార్థుల తల్లిదండ్రులు హైదరాబాద్‌లోని డీఎస్ఎస్ భవన్‌కు వస్తున్నారు.

సీట్ల కోసం పాట్లు.. ఆఫీసర్ల కోసం పడిగాపులు!
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని మహాత్మా జ్యోతిభాఫూలే గురుకుల సొసైటీ విద్యా సంస్థల్లో సీట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో గురుకులాల్లో ఆడ్మిషన్ల కోసం విద్యార్థుల తల్లిదండ్రులు హైదరాబాద్‌లోని డీఎస్ఎస్ భవన్‌కు వస్తున్నారు. తమ ప్రాంతాల్లో ఉన్న గురుకులాల అధికారుల దగ్గరకు వెళ్తే.. హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని చెబుతున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. తీరా హైదరాబాద్‌లోని ఆఫీసుకు వస్తే.. ఉన్నతాధికారులు లేరని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం వచ్చి సాయంత్రం వరకు అధికారుల కోసం వేచి చూస్తున్నామని అంటున్నారు. కొందరు కొత్తగా అడ్మిషన్లు కావాలని వస్తే.. మరికొందరు వేరే గురుకులానికి విద్యార్థిని పంపాలని కోరుతున్నారు.

ఎంజేపీ ఆఫీసు దగ్గర సరిపడా కుర్చీలు లేకపోవడంతో.. విద్యార్థులు తల్లిదండ్రులు వరండాలో కింద కూర్చున్నారు. దాదాపు 15 రోజులుగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఉన్నతాధికారుల గురించి అడిగితే.. పేషీల్లో ఉండే సిబ్బంది, ఉద్యోగులు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో గురుకులాల ఆఫీసర్లు మాత్రం దరఖాస్తుపై కచ్చితంగా రాష్ట్రస్థాయి అధికారి సంతకం కావాలని చెబుతున్నారని పేరెంట్స్ అంటున్నారు. మహబూబాబాద్, నాగర్‌కర్నూల్, వరంగల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్ వంటి సుదూర ప్రాంతాల నుంచి వచ్చామని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. మరోవైపు గురుకులాల్లో పనిచేసే ఉద్యోగులు డిప్యూటేషన్ల కోసం డీఎస్ఎస్ భవన్ చుట్టూ తిరుగుతున్నారు.

Next Story