- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డీటీఆర్ మ్యాపింగ్‌తో విద్యుత్ సేవలు మరింత వేగవంతం
టీజీఎస్పీడీసీఎల్ వినియోగదారులకు మరింత వేగవంతమైన, పారదర్శకమైన, నాణ్యమైన సేవలను అందించేందుకు సరికొత్త సాంకేతికతను అందుబాటులోకి తెచ్చింది.

దిశ, తెలంగాణ బ్యూరో : టీజీఎస్పీడీసీఎల్ వినియోగదారులకు మరింత వేగవంతమైన, పారదర్శకమైన, నాణ్యమైన సేవలను అందించేందుకు సరికొత్త సాంకేతికతను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా సమగ్ర నెట్‌వర్క్ మ్యాపింగ్ కార్యక్రమాన్ని ముమ్మరంగా అమలు చేస్తున్నట్లు టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి. పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ బిల్లింగ్ ప్రక్రియలోనే వినియోగదారుల సర్వీసులను సంబంధిత డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ (డీటీఆర్) స్ట్రక్చర్ కోడ్‌లతో అనుసంధానం చేసే విధంగా ఆటోమేటెడ్ స్పాట్ బిల్లింగ్ మెషిన్ (ఏఎస్బీఎం) సాఫ్ట్‌వేర్‌ను అప్‌గ్రేడ్ చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ కొత్త విధానం ద్వారా మీటర్ రీడర్ ఒక నిర్దిష్ట డీటీఆర్ స్ట్రక్చర్ కోడ్‌ను ఎంపిక చేసి, దానికి అనుసంధానమైన అన్ని సర్వీసుల బిల్లింగ్‌ను వరుస క్రమంలో నిర్వహిస్తారని, దీనివల్ల ప్రతి వినియోగదారుడి సర్వీస్ సరైన డీటీఆర్‌కు ఖచ్చితంగా మ్యాపింగ్ అవుతుందని వివరించారు.
డేటా ఆధారిత నిర్ణయాలతో మెరుగైన సేవలు...
ఈ డీటీఆర్ మ్యాపింగ్ ద్వారా విద్యుత్ నెట్‌వర్క్‌కు సంబంధించిన సమగ్ర, ఖచ్చితమైన డేటా సంస్థకు అందుబాటులోకి వస్తుందని సీఎండీ పేర్కొన్నారు. ఏదైనా డీటీఆర్ పై ఓవర్ లోడ్ ఉంటే వెంటనే తెలిసిపోతుందని... ఫలితంగా లోడ్ కెపాసిటీ పెంచేందుకు అవకాశం ఏర్పడుతుందని ఆయన అన్నారు. అలాగే విద్యుత్ సరఫరాలో తలెత్తే లోపాలను వేగంగా గుర్తించడం, అంతరాయాలను విశ్లేషించడం, నిర్వహణ పనులను సమర్థవంతంగా చేపట్టడంతో పాటు వినియోగదారుల ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించడం సాధ్యమవుతుందని చెప్పారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థను ఆధునికీకరించడం, డేటా ఆధారిత నిర్ణయాలను మరింత బలోపేతం చేయడం ద్వారా వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని జితేష్ వి. పాటిల్ స్పష్టం చేశారు.






