ఆర్టీసీ బస్టాండ్ లో అన్నీ సమస్యలే..

by Taduka Kalyani |   (  Updated:2026-07-02 13:45:15  IST  )

నిత్యం వందలాది మంది ప్రయాణికులతో కిటకిటలాడే లింగంపేట ఆర్టీసీ బస్టాండ్ సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది.

ఆర్టీసీ బస్టాండ్ లో అన్నీ సమస్యలే..
X

దిశ, లింగంపేట: నిత్యం వందలాది మంది ప్రయాణికులతో కిటకిటలాడే లింగంపేట ఆర్టీసీ బస్టాండ్ సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో 2024 సంవత్సరంలో అప్పటి ఎమ్మెల్యే జాజాల సురేందర్ రూ.60 లక్షలు వెచ్చించి ఆర్టీసీ బస్టాండ్ ను ఆధునీకరించారు. బస్టాండ్ లో ప్రయాణికులు కూర్చోవడానికి అవసరమైన బెంచీలను ఏర్పాటు చేశారు.విద్యుత్ దీపాలను అమర్చారు. నూతనంగా మరుగు దొడ్ల ను ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి అవసరమైన కనీస సౌకర్యాలను ఏర్పాటు చేశారు. దాంతో లింగంపేట ఆర్టీసీ బస్టాండ్ జిల్లాలోనే మెరుగైన బస్టాండ్ గా గతంలో గుర్తింపు పొందింది. ఆ గుర్తింపు ఎంతో కాలం నిలవలేదు. ఆర్టీసీ బస్టాండ్ నిర్వహణపై అటు కామారెడ్డి డిపో ఆర్టీసీ అధికారులు, ఇటు లింగంపేట గ్రామ పంచాయతీ సెక్రటరీ, పాలకవర్గ సభ్యులు చేతులెత్తేయడం తో సమస్యలు తాండవిస్తున్నాయి. రోజువారీగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించే వందలాది మంది ప్రయాణికులు కనీస సౌకర్యాలు లేక గత కొన్ని నెలలుగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తాగునీరు లేకపోవడంతో ప్రయాణికులు హోటళ్ల లో వాటర్ బాటిల్ లను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. కాలకృత్యాలు తీర్చుకునేందుకు ముఖ్యంగా మహిళలు చెప్పుకోలేని ఇబ్బందులకు గురవుతున్నారు.

కంపుకొడుతున్న మరుగుదొడ్లు..

లింగంపేట లోని ఆర్టీసీ బస్టాండ్ లో ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు కంపు కొడుతున్నాయి. మరుగుదొడ్లను క్లీన్ చేసే వారు లేకపోవడంతో దుర్గంధం వ్యాపిస్తోంది. కొందరు ప్రయాణికులు మరుగుదొడ్ల ఆవరణలోనే మలమూత్రాలను విసర్జించడంతో దుర్వాసన వెదజల్లుతోంది. బస్సుల కోసం వేచి చూసే ప్రయాణికులు దుర్వాసనను భరించలేక రోడ్ల వెంబడి నిరీక్షించే పరిస్థితి నెలకొంది. గత మూడు నెలలుగా మరుగుదొడ్లు వినియోగంలో లేకపోవడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. బస్టాండ్ లో చెత్త చెదారం పేరుకుపోయి పారిశుధ్యం లోపించింది. బస్టాండ్ ఆవరణలో చెత్తా చెదారం పేరుకు పోవడంతో పాటు తినుబండారాలను, వ్యర్థాలను పారేయడంతో పందులు, పశువులు సంచరిస్తున్నాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మద్యం ప్రియులకు అడ్డగా మారిన ఆర్టీసీ బస్టాండ్..

లింగంపేట మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ మద్యం పియులకు అడ్డాగా మారింది. బస్టాండ్ లో విద్యుత్ దీపాలు వెలగక పోవడంతో అంధకారం నెలకొంది. దీంతో కొందరు మద్యం ప్రియులు బస్టాండ్ ను అడ్డాగా చేసుకొని కల్లు, మద్యం సేవిస్తూ బాటిళ్ల ను బస్టాండ్ ఆవరణలో పడేస్తున్నారు. ప్రయాణికులు కూర్చుండే బెంచీల పక్కనే కల్లు సీసాలు దర్శనమిస్తున్నాయి. దీంతో స్టూడెంట్స్ విద్యావంతులు, మహిళలు బస్టాండ్ లో ఉండలేక బస్టాండ్ ఆవరణలో బస్సుల కోసం నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. లింగంపేట మండలంలోని శెట్పల్లి సంగారెడ్డి, ఎక్కపల్లి, అయ్యపల్లి, మెంగారం, బోనాల్, బాణాపూర్, భవానిపేట్, జల్దిపల్లి, ముంబాజిపేట్, కొండాపూర్, నల్ల మడుగు, పోల్కంపేట, మోతే, ఐలాపూర్, పోతా యిపల్లి, కోమటిపల్లి, ముస్తాపూర్, లింగంపల్లి తదితర గ్రామాలకు చెందిన వందలాది మంది ప్రయాణికు దెగ్లూరు, మెదక్, నిజామాబాద్ హైదరాబాద్, కరీంనగర్ తదితర ప్రాంతాలకు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. బస్టాండ్ లో అంధకారం నెలకొనడంతో రాత్రి వేళల్లో మహిళలు, కాలేజీలకు వెళ్లి వచ్చే విద్యార్థినిలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

పట్టించుకోని అధికారులు..

లింగంపేట బస్టాండ్ లో పారిశుధ్యం లోపించి దుర్వాసన వ్యాపిస్తున్న అటు ఆర్టీసీ అధికారులు కానీ ఇటు గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు పట్టించుకోవడం లేదని ప్రయాణికులు ఆరోపిస్తు న్నారు. నెలల తరబడి బస్టాండ్ లో తాగునీరు లేకపోవడం, మరుగుదొడ్లు వినియోగంలో లేకపోవడం, బస్టాండ్ ఆవరణలో చెత్తా చెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతుండటంతో ప్రయాణికులు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. అయినప్పటికిని ఆర్టీసీ, గ్రామ పంచాయతీ అధికారులు పట్టించుకోకపోవడం ప్రయాణికుల పాలిట శాపంగా మారింది. ఆర్టీసీ కామారెడ్డి డిపో మేనేజర్, లింగంపేట జి పి సెక్రటరీ, పాలకవర్గ సభ్యులు స్పందించి బస్టాండ్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఆయా గ్రామాల ప్రయాణికులు కోరుతున్నారు.

ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదు: ముదాం సాయిలు. మాజీ ఎంపీపీ

లింగంపేట బస్టాండ్ లో నెలకొన్న సమస్యలపై కామారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్ కు పలుమార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని లింగంపేట మాజీ ఎంపీపీ ముదాం సాయిలు అన్నారు. బస్టాండ్ లో ప్రయాణికులకు తాగునీరు లేదని, మరుగుదొడ్లు కంపు కొడుతున్నాయని, విద్యుత్ లైట్లు వెలగక అంధకారంలో ఉందని మొరపెట్టుకున్న డిపో మేనేజర్ పట్టించుకోవడం లేదని అన్నారు. గ్రామ పంచాయతీ సెక్రటరీ పాలకవర్గ సభ్యులు సైతం పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆయన కోరుతున్నారు.

బస్టాండ్ ను నేను వచ్చి పరిశీలిస్తా : దినేష్ కుమార్ డిపో మేనేజర్ కామారెడ్డి

లింగంపేట ఆర్టీసీ బస్టాండ్ లో నెలకొన్న సమస్యలపై ఆర్టీసీ కామారెడ్డి డిపో మేనేజర్ దినేష్ కుమార్ ను ‘దిశ’ వివరణ కోరగా బస్టాండ్ లో నెలకొన్న సమస్యలపై ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. తానే స్వయంగా వచ్చి బస్టాండ్ ను పరిశీలిస్తానని, సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారు.

Next Story