అమెరికాలో విషాదం: అగ్నిప్రమాదంలో గుజరాత్ దంపతులు, కుమార్తె మృతి

by Ramesh Naini |

అమెరికాలోని ఒహియో రాష్ట్రంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో గుజరాత్‌కు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

అమెరికాలో విషాదం: అగ్నిప్రమాదంలో గుజరాత్ దంపతులు, కుమార్తె మృతి
X

దిశ, డైనమిక్ బ్యూరో: అమెరికాలోని ఒహియో రాష్ట్రంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో గుజరాత్‌కు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వారు నివసిస్తున్న మోటెల్‌లో అర్ధరాత్రి మంటలు చెలరేగడంతో గదిలోనే చిక్కుకుపోయి ఊపిరాడక మృతి చెందినట్లు తెలిసింది. జాతీయ మీడియా సమాచారం ప్రకారం.. గుజరాత్‌లోని ఖేడా జిల్లా నడియాద్‌కు చెందిన హితేష్‌భాయ్ సుతార్, ఆయన భార్య హీనాబెన్, 20 ఏళ్ల కుమార్తె ఇషాని మృతి చెందారు. ఉపాధి కోసం రెండేళ్ల క్రితం అమెరికా వెళ్లిన వీరు, ఒహియో రాష్ట్రం వూస్టర్‌ నగరంలో ఉన్న ‘ఎకానో లాడ్జ్’ (Econo Lodge) అనే మోటెల్‌లో పనిచేస్తూ అక్కడే నివసిస్తున్నారు. స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 1:30 గంటల ప్రాంతంలో మోటెల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

ప్రాణాలు దక్కించుకునే ప్రయత్నం..

మంటలు వ్యాపించడంతో గదిలో చిక్కుకున్న కుటుంబం, సహాయం కోసం మోటెల్ ఫ్రంట్ డెస్క్ సిబ్బందికి ఫోన్ చేసి కన్నీరుమున్నీరుగా వేడుకున్నారు. వెంటనే బాత్రూమ్‌లోకి వెళ్లి, నీళ్ల కుళాయిలు ఆన్ చేసి తలుపులు వేసుకోవాలని సిబ్బంది సూచించారు. ఆ కుటుంబం ప్రాణాలు దక్కించుకునేందుకు బాత్రూమ్‌లో తలదాచుకున్నప్పటికీ, మంటలు, దట్టమైన పొగ తీవ్రతకు ఊపిరాడక ముగ్గురూ ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు శ్రమించారు. లోపల చిక్కుకున్న వారిని రక్షించేందుకు పలుమార్లు ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదని అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో మంటలార్పుతున్న ఒక ఫైర్‌మెన్‌కు స్వల్ప గాయాలు కాగా, మోటెల్‌లో ఉన్న మరెవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని స్థానిక వార్తా సంస్థలు వెల్లడించాయి. ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story