కేరళలో విషాదం.. ఊరి మనిషిలా ఆదరించిన 70 ఏళ్ల అడవి ఏనుగు ‘లక్ష్మి’ కన్నుమూత

by Ramesh Naini |

అడవి జంతువులు, మనుషుల మధ్య తరచూ ప్రాణాంతక ఘర్షణలు జరిగే కేరళ అటవీ ప్రాంతంలో ఓ అరుదైన, ఆత్మీయమైన బంధం ముగిసింది.

కేరళలో విషాదం.. ఊరి మనిషిలా ఆదరించిన 70 ఏళ్ల అడవి ఏనుగు ‘లక్ష్మి’ కన్నుమూత
X

దిశ, డైనమిక్ బ్యూరో: అడవి జంతువులు, మనుషుల మధ్య తరచూ ప్రాణాంతక ఘర్షణలు జరిగే కేరళ అటవీ ప్రాంతంలో ఓ అరుదైన, ఆత్మీయమైన బంధం ముగిసింది. వయనాడ్ జిల్లాలోని చెకాడి గ్రామస్తులు తమ ఊరి మనిషిలా ఆదరించిన ‘లక్ష్మి’ అనే 70 ఏళ్ల అడవి ఏనుగు వయోభారంతో కన్నుమూసింది. గురువారం ఉదయం పత్తిరి అటవీ ప్రాంతంలో లక్ష్మి కళేబరాన్ని గుర్తించినట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు.

పంటలను పాడుచేయని సాధు జంతువు..

పుల్పల్లి సమీపంలోని అటవీ సరిహద్దు గ్రామమైన చెకాడికి ఈ ఏనుగు తరచూ వచ్చేది. సాధారణంగా అడవి ఏనుగులు గ్రామాల్లోకి వస్తే పంటలను నాశనం చేయడం, మనుషులపై దాడి చేయడం చేస్తాయి. కానీ, లక్ష్మి ఎన్నడూ పంటలను ధ్వంసం చేయలేదు, ఎవరికీ హానీ చేయలేదు. ఏనుగుకు పనస పండ్లు అంటే ఎంతో ఇష్టం కావడంతో, ఆ చెట్లు ఎక్కువగా ఉండే గిరిజన ప్రాంతాల్లోనే అది ఆశ్రయం పొందేది.

గ్రామస్తుల ముద్దుబిడ్డ..

నెమ్మదిగా లక్ష్మి గ్రామస్తులకు, ముఖ్యంగా పిల్లలకు ఎంతో దగ్గరైంది. గ్రామస్తులు ‘లక్ష్మి’ అని పిలవగానే వారి దగ్గరకు వచ్చేదని స్థానికులు గుర్తుచేసుకున్నారు. మహిళలు, పిల్లలు ఇచ్చే పనస, మామిడి పండ్లను ఎంతో ప్రేమగా తీసుకునేది. ఈ ఏనుగు ప్రశాంత స్వభావం గురించి తెలుసుకున్న పర్యాటకులు, వ్లాగర్లు, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్లు లక్ష్మిని చూసేందుకు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చేవారు.

వయోభారంతోనే మృతి

లక్ష్మికి 70 ఏళ్లు పైబడి ఉంటాయని, వయసు మీద పడటం వల్ల వచ్చిన సహజమైన అనారోగ్య సమస్యలతోనే ఏనుగు మృతి చెందిందని అటవీ శాఖ ఏసీఎఫ్ అజిత్ కె. రామన్ తెలిపారు. వృద్ధాప్యం కారణంగానే అది ఎక్కువ దూరం వలస వెళ్లకుండా, ఆహారం, నీరు సులభంగా దొరికే చెకాడి పరిసరాల్లోనే ఉండిపోయిందని నిపుణులు భావిస్తున్నారు. పోస్ట్‌మార్టం అనంతరం వన్యప్రాణి నిర్వహణ నిబంధనల ప్రకారం అడవిలోనే లక్ష్మికి అంత్యక్రియలు నిర్వహించారు. తమ ప్రియమైన లక్ష్మిని కడసారి చూసేందుకు గ్రామస్తులు కన్నీటిమున్నీరుగా తరలివచ్చారు.

Next Story