క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు టెండర్లు.. తుది దశలో స్థలాల సేక‌ర‌ణ‌

by Ajay Maddhiboyina |

క్యూర్ పరిధిలోని ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాంతంలో లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే టెండర్లు పిలవనుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.

క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు టెండర్లు.. తుది దశలో స్థలాల సేక‌ర‌ణ‌
X

దిశ, తెలంగాణ బ్యూరో: క్యూర్ పరిధిలోని ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాంతంలో లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే టెండర్లు పిలవనుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. గోషామహల్ నియోజకవర్గంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు సంబంధించిన పట్టాలను గురువారం సహచర మంత్రులు పొన్నం ప్రభాకర్, మహ్మద్ అజారుద్దీన్, అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, స్థానిక‌ ఎమ్మెల్యే రాజాసింగ్ తదితరులతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు మూడు కార్పొరేషన్ల పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణానికి అవసరమైన స్థల సేకరణ మరో రెండు నుంచి మూడు రోజుల్లో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి ఇల్లు అనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నదని స్పష్టం చేశారు. క్యూర్ ప‌రిధిలోని 19 నియోజకవర్గాల్లో పైలెట్ ప్రాజెక్ట్ కింద ఒక్కో చోట కనీసం 500 నుంచి 1000 ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. అనంతరం రెండు, మూడో విడతల్లో మరిన్ని ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే ఒక్కో నియోజకవర్గానికి 5,500 వరకు ఇళ్లు కేటాయించిన విషయాన్ని గుర్తు చేస్తూ, పట్టణ ప్రాంతాల్లో భూమి విలువ ఎకరాకు రూ.100 నుంచి రూ.200 కోట్ల వరకు ఉన్నా కూడా ఆ భూముల విలువను పక్కనబెట్టి పేదలకు అదే ప్రాంతంలో ఇళ్లు నిర్మించి వారి పేరిట పట్టాలు ఇస్తామని మంత్రి తెలిపారు. ధూల్‌పేట ప్రాంతంలో గత ప్రభుత్వంలో అసంపూర్తిగా నిలిచిపోయిన 125 ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి అందిస్తున్నామని, మిగిలిన పేదలకు కూడా ఇళ్లు మంజూరు చేసేలా పరిసర ప్రాంతాల్లో స్థలాలను గుర్తించేందుకు కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నిర్మించిన ఇళ్ల కంటే కేవలం రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ ఇళ్లు నిర్మిస్తుందని.. అది సాధ్యం కాకపోతే తాను రానున్న ఎన్నికల్లో పోటీ చేయనని విసిరిన సవాల్‌కు ఇప్పటివరకు బీఆర్ఎస్ నేతల నుంచి స్పందన రాలేదని గుర్తుచేశారు.

బీఆర్ఎస్ గూండాగిరికి భ‌య‌ప‌డేది లేదు

రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ గూండాగిరికి కాంగ్రెస్ ప్రభుత్వం భ‌య‌ప‌డేది లేద‌ని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. కోట్లాది రూపాయిలు కొల్లగొట్టిన బీఆర్ఎస్ నాయ‌కులు ఇంకా అధికారంలోనే ఉన్నాం లేదా మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తామ‌నే భ్రమ‌తో మాట్లాడుతున్నారని అన్నారు. వారి అవినీతి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు అసెంబ్లీ సాక్షిగా బ‌య‌ట‌పెట్టారని.. అయినా ఇంకా అధికారంలోకి వ‌స్తామ‌ని ప‌గ‌టి క‌ల‌లు కంటూ ఈ ప్రభుత్వంపై గుడ్డకాల్చి వేసిన‌ట్లు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ప‌దేళ్లలో వారు అంటించుకున్న బుర‌ద‌ను ఇప్పటి ప్రభుత్వానికి లేదా మంత్రుల‌కు అంటించాల‌ని చూస్తున్నారని అన్నారు. ఏ శాఖ అయినా స‌రే పిలిచిన టెండ‌ర్ మొత్తం కంటే మూడు నాలుగు రెట్లు అవినీతి జ‌రిగింద‌ని ఆరోపించ‌డం వారి అవివేకానికి నిద‌ర్శమన్నారు. స‌వాల్‌ను స్వీక‌రించి మంత్రులు వ‌స్తే రాకుండా ప‌రార‌య్యారని అన్నారు. అసెంబ్లీలో సైతం మీరు ఏం మాట్లాడ‌తారో తమకు తెలుసని.. దానికి కూడా తేదీని ఖ‌రారు చేస్తామని పొంగులేటి వెల్లడించారు.

Next Story