ప్రభుత్వ నిబంధనల ప్రకారం భూ సర్వే : కలెక్టర్ కుమార్ దీపక్

by Batti.Sumithra |

ప్రభుత్వ నిబంధనల ప్రకారం భూ సర్వే నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం భూ సర్వే : కలెక్టర్ కుమార్ దీపక్
X

దిశ, మంచిర్యాల : ప్రభుత్వ నిబంధనల ప్రకారం భూ సర్వే నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం మంచిర్యాల జిల్లా భీమారం మండలంలోని మద్దికల్ గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొని కలెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం భూ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. రికార్డులు, మోకా, పట్టాదారుల వివరాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. గ్రామంలోని భూములకు సంబంధించిన హద్దులను నిర్ధారించాలని తెలిపారు.

ప్రభుత్వ భూములను సైతం గుర్తించాలని అన్నారు. పట్టా ఉండి మోకాలో లేకపోవడం, మోకాలో ఉండి పట్టా లేకపోవడం వంటి అంశాల పై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. నిబంధనల ప్రకారం సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేసి, న్యాయపరంగా రావాల్సిన భూమిని పొందే అవకాశం కల్పిస్తామని తెలిపారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేశారు. తరగతి గదులు, వంటశాలను పరిశీలించారు. విద్యార్థుల పట్ల శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. మెనూ ప్రకారం నాణ్యమైన కూరగాయలతో భోజనం అందించాలని ఆదేశించారు. అనంతరం ఖ్యాతనపల్లి మున్సిపల్ పరిధిలో అమృత్ 2.0 తాగునీటి పైప్‌లైన్ నిర్మాణ పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. గుత్తేదారు నాణ్యతా ప్రమాణాలతో నిర్మాణ పనులు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట తహసీల్దార్ సదానందం, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Next Story