గిరిజన గ్రామాలకు ఊరట..

by Taduka Kalyani |

అత్యవసర వైద్య సేవల కోసం సత్యనారాయణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి (పీహెచ్‌సీ) 108 అంబులెన్స్‌ను తిరిగి కేటాయిస్తూ జిల్లా యంత్రాంగం నిర్ణయం తీసుకుంది.

గిరిజన గ్రామాలకు ఊరట..
X

దిశ, చర్ల,: అత్యవసర వైద్య సేవల కోసం సత్యనారాయణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి (పీహెచ్‌సీ) 108 అంబులెన్స్‌ను తిరిగి కేటాయిస్తూ జిల్లా యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, ప్రజాప్రతినిధుల వినతులు, మీడియా కథనాలపై స్పందించిన అధికారులు ఈ నిర్ణయం తీసుకోవడంతో పరిసర గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల సత్యనారాయణపురం పీహెచ్‌సీకి చెందిన 108 అంబులెన్స్‌ను చర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించడంతో సత్యనారాయణపురం, ఆర్.కొత్తగూడెం, కలివేరు తదితర గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా గర్భిణులు, పాముకాటు బాధితులు, గుండెపోటు వచ్చిన వారు, ప్రమాదాల్లో గాయపడిన వారిని సకాలంలో ఆసుపత్రికి తరలించే పరిస్థితి లేకపోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను పరిష్కరించాలని ఆర్.కొత్తగూడెం సర్పంచ్ తుర్రం రవికుమార్, దానవాయిపేట వార్డు సభ్యురాలు కణితి రజిని, రుంజ రాజా తదితరులు భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు, జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. మీడియా ప్రతినిధులు కూడా సమస్య తీవ్రతను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు టి.జీ.08 టి 4821 నంబర్ గల 108 అంబులెన్స్‌ను తిరిగి సత్యనారాయణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కేటాయించారు. దీంతో మారుమూల గ్రామాల ప్రజలకు అత్యవసర వైద్య సేవలు మరింత అందుబాటులోకి రానున్నాయి. అంబులెన్స్ పునరుద్ధరణపై సత్యనారాయణపురం సర్పంచ్ చిక్కాల గౌతమి, కలివేరు సర్పంచ్ తెల్లం లక్ష్మణ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యను గుర్తించి వెంటనే స్పందించిన భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు, జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, అలాగే సమస్యను వెలుగులోకి తీసుకొచ్చిన మీడియా ప్రతినిధులకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్.కొత్తగూడెం సర్పంచ్ తుర్రం రవికుమార్, సత్యనారాయణపురం సర్పంచ్ చిక్కాల గౌతమి, కలివేరు సర్పంచ్ తెల్లం లక్ష్మణ్, రుంజ రాజా, తదితరులు పాల్గొన్నారు.

Next Story