మాజీలకు షాక్.. బుల్లెట్ ప్రూఫ్ వెహికిల్స్ తొలగింపు

by Muthe.Rajitha |

మాజీలకు షాక్.. బుల్లెట్ ప్రూఫ్ వెహికిల్స్ తొలగింపు
X

దిశ, వెబ్ డెస్క్ : మాజీ పోలీసు బాసులకు బిగ్ షాక్. ఇకపై వారికి బుల్లెట్ ప్రూఫ్ వాహనాల వంటి సౌకర్యాలు ఏవీ ఉండవు. ఇంటెలిజెన్స్ శాఖ నివేదిక ఆధారంగా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం మాజీ డీజీపీలు, రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు, మాజీ ఉన్నతాధికారులు, కొంతమంది వీఐపీలకు గతంలో కల్పించిన బుల్లెట్‌ప్రూఫ్ వాహనాలు, గన్‌మెన్‌ల వంటి భద్రతా సౌకర్యాలను తగ్గించే ప్రక్రియను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇంటెలిజెన్స్ బ్యూరో తాజా భద్రతా నివేదికల ఆధారంగా 100 మందికి పైగా ప్రముఖులకు ఇప్పటివరకు కల్పిస్తున్న భద్రతను సమీక్షించి, అవసరం లేని చోట తగ్గించేందుకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రస్తుతం తెలంగాణాలో నక్సలిజం లేకపోవడం, ఇంటెలిజెన్స్ నివేదికలు, ప్రభుత్వ ఖర్చు తగ్గింపు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ప్రముఖులకు ఇస్తున్న భద్రతా సౌకర్యాలను పునఃసమీక్షిస్తున్నారు అధికారులు.

అయితే ఈ నిర్ణయం ప్రతిపక్షాలను టార్గెట్ చేసేందుకేనని ఆరోపణలు వినవస్తున్నాయి. మాజీ అధికారులకు, ప్రజాప్రతినిధులకు కల్పించిన భద్రతను తగ్గించడం సరైన నిర్ణయం కాదని విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్‌ఎస్ నాయకుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్‌కు దాదాపు 20 ఏళ్లుగా ఉన్న బుల్లెట్‌ప్రూఫ్ వాహనాన్ని కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకునే ప్రయత్నం చేసింది. అయితే దీనిని సవాలు చేస్తూ ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా.. వారం రోజుల పాటు బుల్లెట్‌ప్రూఫ్ వాహనాన్ని తొలగించవద్దని జూన్ 30న మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంపై తదుపరి విచారణ కొనసాగుతోంది. మరోవైపు ప్రభుత్వ వ్యయాన్ని భారీగా తగ్గించడం కోసమే ఈ చర్యలని సర్కారు సమర్థించుకుంటోంది.

Next Story