విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధే లక్ష్యం.. ‘ఆరోగ్య పాఠశాల’కు మరింత బలోపేతం

by Batti.Sumithra |

విద్యార్థుల ఆరోగ్యం, విద్య, భద్రత, వ్యక్తిత్వ వికాసమే లక్ష్యంగా జిల్లాలో అమలు చేస్తున్న ‘ఆరోగ్య పాఠశాల’ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా కొనసాగిస్తామని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు.

విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధే లక్ష్యం.. ‘ఆరోగ్య పాఠశాల’కు మరింత బలోపేతం
X

దిశ, బజార్‌హత్నూర్ : విద్యార్థుల ఆరోగ్యం, విద్య, భద్రత, వ్యక్తిత్వ వికాసమే లక్ష్యంగా జిల్లాలో అమలు చేస్తున్న ‘ఆరోగ్య పాఠశాల’ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా కొనసాగిస్తామని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. గురువారం బజార్‌హత్నూర్ మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల, కళాశాలలో నిర్వహించిన మూడో విడత ఆరోగ్య పాఠశాల కార్యక్రమాన్ని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్యతో కలిసి కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు, విద్యార్థులు పాటలు, నృత్యాలు, నాటికల ద్వారా ఆరోగ్య పాఠశాల కార్యక్రమంలోని అంశాలపై అవగాహన కల్పించారు. అధికారులు వ్యక్తిగత పరిశుభ్రత, పోషకాహారం, మానసిక ఆరోగ్యం, మాదకద్రవ్యాల నివారణ, కాలానుగుణ వ్యాధుల నివారణ, వ్యక్తిత్వ వికాసం వంటి ఆరు ప్రధాన అంశాలపై విద్యార్థులకు వివరించారు.

కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ జిల్లాలో గత రెండేళ్లుగా ఆరోగ్య పాఠశాల కార్యక్రమం విజయవంతంగా అమలవుతోందని, దీనికి రాష్ట్రస్థాయిలో గుర్తింపు, అవార్డులు లభించాయని తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల రక్షణ కోసం పోక్సో చట్టంపై ప్రత్యేక అవగాహన కల్పించేందుకు ‘పోక్సో క్యాలెండర్’ రూపొందించామని చెప్పారు. విద్యార్థులు తమ సమస్యలను నిర్భయంగా, గోప్యంగా తెలియజేసేందుకు ప్రతి పాఠశాలలో ఫిర్యాదుల పెట్టెలను ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి నెల మొదటి తేదీన వాటిని తెరిచి సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో బహిరంగ మలమూత్ర విసర్జన వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొంటూ ప్రతి కుటుంబం ఇంటి వద్ద మరుగుదొడ్డి నిర్మించుకుని వినియోగించాలని సూచించారు. వర్షాకాలంలో వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, విద్యార్థులు ఇంగ్లిష్ భాషా నైపుణ్యాలను పెంపొందించుకోవడంతో పాటు ఖాన్ అకాడమీ ద్వారా గణితం, సైన్స్‌లో పట్టు సాధించాలని సూచించారు. ఈ ఏడాది జిల్లా నుంచి ట్రిపుల్ ఐటీ బాసరకు రికార్డు స్థాయిలో 67 మంది విద్యార్థులు ఎంపిక కావడం ఆనందదాయకమన్నారు. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుకు మంచి ఆరోగ్యం, నాణ్యమైన విద్య రెండూ అవసరమని అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో ప్రవేశాల కోసం డిమాండ్ పెరుగుతోందని తెలిపారు.

జిల్లా కలెక్టర్ రూపొందించిన ఆరోగ్య పాఠశాల, విద్యా క్యాలెండర్ రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని పిలుపునిచ్చారు. మోడల్ స్కూల్‌లో త్వరలో సీసీ రోడ్డు, బోర్‌వెల్ సదుపాయం కల్పించనున్నట్లు తెలిపారు. కొత్తపల్లి గ్రామానికి సుమారు రూ. కోటి వ్యయంతో వంతెన మంజూరు చేయించినట్లు చెప్పారు. అలాగే జిల్లాలోని కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో స్వచ్ఛమైన తాగునీటి కోసం వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య మాట్లాడుతూ విద్యార్థుల సంక్షేమం కోసం జిల్లా కలెక్టర్ చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు. ప్రతి పాఠశాలలో గ్రంథాలయం ఏర్పాటుకు తన వంతు సహకారం అందిస్తానని చెప్పారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి విద్యపై దృష్టి సారించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం కలెక్టర్, ఎమ్మెల్యే, గ్రంథాలయ సంస్థ చైర్మన్ కలిసి పోక్సో చట్టం–2012 క్యాలెండర్ను ఆవిష్కరించారు. అనంతరం పోషకాహార తోటను ప్రారంభించి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీవో రవీందర్, తహసీల్దార్ శ్యాంసుందర్, ఎంపీడీవో మహేందర్ రెడ్డి, ఎంఈవో రాంకిషన్, అకడమిక్ కోఆర్డినేటర్లు లక్ష్మణ్, అజయ్, సర్పంచ్ సాయన్న, ప్రిన్సిపాల్ సంగీత, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Next Story