కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లది ‘బిగ్ బాస్’ డ్రామా: కేంద్ర మంత్రి బండి సంజయ్

by Malleboina Mahesh |

కాంగ్రెస్, బీఆర్ఎస్‌లది ‘బిగ్ బాస్’ డ్రామా.. అవినీతిపై చర్చకు డేట్, టైం ఫిక్స్ చేస్తాం, దమ్ముంటే రావాలని కేంద్రమంత్రి బండి సంజయ్ సవాల్ విసిరారు.

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లది ‘బిగ్ బాస్’ డ్రామా: కేంద్ర మంత్రి బండి సంజయ్
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య సాగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇరు పార్టీల వైఖరిని ఎండగడుతూ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (X) వేదికగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలు, ప్రతి విమర్శలు చూస్తుంటే పాపులర్ రియాలిటీ షో 'బిగ్ బాస్ ను తలపిస్తోందని ఎద్దేవా చేశారు. వారం ముందే రిహార్సల్ చేసుకుని మరీ ఇరు పార్టీల నేతలు పోటాపోటీగా నటనలో జీవిస్తున్నారని, అబద్దాలు చెప్పడంలో వీరికి ఆస్కార్ అవార్డు ఇస్తే ఇద్దరు దానికి పూర్తిగా అర్హులవుతారని బండి సంజయ్ ఘాటుగా విమర్శించారు. నేతల డ్రామాలను చూసి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు.

అలాగే కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాల పాలనా వైఫల్యాలను, అక్రమాలను ప్రజల ముందుంచేందుకు బీజేపీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందంటూ కేంద్ర మంత్రి బహిరంగ సవాల్ విసిరారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో చర్చకు సంబంధించిన డేట్, టైం, వేదికను తామే ఫిక్స్ చేస్తామని, దమ్ముంటే గురుకులాల టెండర్లు, తెలంగాణను ముంచిన అప్పులు, అవినీతిపై చర్చకు రావాలని సవాల్ చేశారు. అదే వేదికపై కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి కేటాయించిన నిధులు, సంక్షేమ పథకాలపై కూడా చర్చించవచ్చని స్పష్టం చేశారు. నాయకులు ఇలాగే డ్రామాలాడితే జనం ఛీ కొట్టడం ఖాయమని హెచ్చరించిన బండి సంజయ్.. ఈ ‘రాజకీయ బిగ్ బాస్ షో’లో ప్రజలు కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు ‘డబుల్ ఎలిమినేషన్’ ఖరారు చేశారని, రాష్ట్రంలోనూ ‘డబుల్ ఇంజిన్ సర్కార్’ రావాలని ఆకాంక్షిస్తున్నారని తేల్చిచెప్పారు.

Next Story