విద్యార్థులకు 20 నిమిషాలు ఆలస్యంగా మధ్యాహ్న భోజనం..

by Ratna Kumari |   (  Updated:2026-07-02 08:58:29  IST  )

శ్రీరంగాపూర్ మండలంలోని జడ్పీ పీహెచ్‌ఎస్ హైస్కూల్‌లో గురువారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సుమారు 20 నిమిషాలు ఆలస్యంగా అందడంతో విద్యార్థులు ఆకలితో భోజనం కోసం ఎదురుచూడాల్సి వచ్చింది.

విద్యార్థులకు 20 నిమిషాలు ఆలస్యంగా మధ్యాహ్న భోజనం..
X

దిశ, శ్రీరంగాపూర్: శ్రీరంగాపూర్ మండలంలోని జడ్పీ పీహెచ్‌ఎస్ హైస్కూల్‌లో గురువారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సుమారు 20 నిమిషాలు ఆలస్యంగా అందడంతో విద్యార్థులు ఆకలితో భోజనం కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. ఈ విషయమై ఉపాధ్యాయులను ప్రశ్నించగా, కట్టెల పొయ్యిపై వంట చేయడం, గ్యాస్ సిలిండర్ వినియోగాన్ని తగ్గించే ప్రయత్నంలో వంట ఆలస్యమైందని, గురువారం మాత్రమే ఈ పరిస్థితి ఏర్పడిందని వారు వివరణ ఇచ్చారు. ఇదిలా ఉండగా, విద్యార్థులకు అందిస్తున్న తాగునీటి నాణ్యతపై కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. తాగునీటిలో పురుగులు, మురికి కనిపిస్తున్నాయని, అలాంటి నీటినే విద్యార్థులు తాగాల్సి వస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై ఉపాధ్యాయులను ప్రశ్నించగా, "మా వల్ల ఏమీ చేయలేం. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందిస్తేనే సమస్య పరిష్కారమవుతుంది" అని చెప్పినట్లు సమాచారం. పాఠశాలలో నీటి శుద్ధి సౌకర్యాలు ఉన్నప్పటికీ వాటి నిర్వహణ సరిగా లేకపోవడంతో గ్రామపంచాయతీ ట్రాక్టర్ ద్వారా తీసుకొచ్చే నీటినే విద్యార్థులు తాగేందుకు, ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారని తెలుస్తోంది. కలుషిత నీటితో విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై సంబంధిత విద్యాశాఖ అధికారులు స్పందించి, మధ్యాహ్న భోజనం సకాలంలో అందించడంతో పాటు విద్యార్థులకు పరిశుభ్రమైన తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Next Story