- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శాతవాహనలో పరీక్షల గుట్టు రట్టు తేల్చేది ఎప్పుడు..?
శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో ఏప్రిల్ నెలలో నిర్వహించిన డిగ్రీ రెండో, నాలుగో, ఆరవ సెమిస్టర్ పరీక్షల్లో తీవ్ర అక్రమాలు జరిగాయని బీఆర్‌ఎస్‌వీ శాతవాహన యూనివర్సిటీ ఇన్‌చార్జి చుక్క శ్రీనివాస్ ఆరోపించారు.

దిశ, కొత్తపల్లి : శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో ఏప్రిల్ నెలలో నిర్వహించిన డిగ్రీ రెండో, నాలుగో, ఆరవ సెమిస్టర్ పరీక్షల్లో తీవ్ర అక్రమాలు జరిగాయని బీఆర్‌ఎస్‌వీ శాతవాహన యూనివర్సిటీ ఇన్‌చార్జి చుక్క శ్రీనివాస్ ఆరోపించారు. గురువారం ఆయన మాట్లాడుతూ, కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన పరీక్షల సందర్భంగా కొంతమంది యూనివర్సిటీ అధికారులు, ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు, సిబ్బంది కుమ్మక్కై అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. పరీక్షా కేంద్రంలో విద్యార్థి హాజరు నమోదైనా, వాస్తవానికి అతడు పరీక్షా హాలులో ఉండకుండా వేరే చోట పరీక్ష రాసి, అనంతరం ఆ జవాబు పత్రాలను పరీక్షా కేంద్రంలోని పత్రాలతో కలిపినట్లు తమకు సమాచారం ఉందన్నారు. పరీక్షా కేంద్రంలో విధులు నిర్వహించిన ఇన్విజిలేటర్లు కూడా ఈ వ్యవహారంపై మౌనం వహించారని ఆరోపించారు. ఈ అక్రమాలన్నీ యూనివర్సిటీలోని కొంతమంది అధికారుల కనుసన్నల్లోనే జరిగాయని, అయితే డబ్బుల పంపకాల విషయంలో తలెత్తిన విభేదాల కారణంగా ఈ వ్యవహారం బయటకు వచ్చిందని చుక్క శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ విషయమై పరీక్షల నియంత్రణ అధికారిని ప్రశ్నించగా, ఈ అంశం తమ దృష్టికి రాలేదని, అధికారికంగా ఫిర్యాదులు లేదా ఆరోపణలు వస్తే విచారణ కమిటీని ఏర్పాటు చేసి వాస్తవాలను వెలికితీసి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపినట్లు ఆయన చెప్పారు. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కళాశాలపై సమగ్ర విచారణ జరిపి, ఆరోపణలు నిజమని తేలితే గుర్తింపును రద్దు చేయాలని చుక్క శ్రీనివాస్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.






