'గంజాయి' నిందితుడు హర్యానాలో అరెస్ట్

by Taduka Kalyani |

నార్సింగి పోలీసుల కస్టడీ నుంచి పరారైన అంతర్రాష్ట్ర గంజాయి కేసు నిందితుడు ముజఫర్‌ను సైబరాబాద్ పోలీసులు ఎట్టకేలకు హర్యానాలో అరెస్ట్ చేశారు

గంజాయి నిందితుడు హర్యానాలో అరెస్ట్
X

దిశ, గండిపేట: నార్సింగి పోలీసుల కస్టడీ నుంచి పరారైన అంతర్రాష్ట్ర గంజాయి కేసు నిందితుడు ముజఫర్‌ను సైబరాబాద్ పోలీసులు ఎట్టకేలకు హర్యానాలో అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ గచ్చిబౌలిలోని తన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇటీవల గంజాయి కేసులో ముజఫర్‌ను నార్సింగి పోలీసులు, ఈగల్ టీం అరెస్ట్ చేసి విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. ఈ క్రమంలో తనకు కడుపు నొప్పిగా ఉందని బాత్‌రూమ్‌కు వెళ్లిన నిందితుడు అక్కడి కిటికీలో నుంచి పోలీసుల కళ్లుగప్పి కస్టడీ నుంచి పరారయ్యాడు. దీంతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమై నిందితుడి కోసం ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టింది. సైబరాబాద్ సీపీ రమేష్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు సాంకేతిక ఆధారాలు, నిఘా సమాచారంతో నిందితుడి కదలికలను నిరంతరం పర్యవేక్షించాయి. ఈ క్రమంలో ముజఫర్ తన భార్యతో కలిసి ఢిల్లీకి పారిపోతున్నట్లు సమాచారం అందడంతో వెంటనే ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.

హర్యానా సరిహద్దుల్లో..

హర్యానా సరిహద్దుల్లో నిందితుడు ముజాఫర్ తో పాటు అతని భార్యను పోలీసులు అదుపులోకి తీసుకుని అనంతరం హైదరాబాద్‌కు తరలించారు. ఈ సందర్భంగా సీపీ రమేష్ మాట్లాడుతూ.. నిందితుడు చాకచక్యంగా తప్పించుకున్నా సాంకేతికతను వినియోగించి హర్యానాలో అరెస్ట్ చేసినట్లు వివరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై, డ్రగ్స్ ముఠాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా ముజఫర్ పారిపోయిన ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై విచారణ నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో డిసిపి చింతమనేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Next Story