వరద ముప్పుకు చెక్.. కాలువల్లో పూడికతీత కు శ్రీకారం

by Taduka Kalyani |

వరద ముప్పుకు చెక్ పెట్టేందుకు మున్సిపల్ అధికారులు శ్రీకారం చుట్టారు.

వరద ముప్పుకు చెక్.. కాలువల్లో పూడికతీత కు శ్రీకారం
X

దిశ, జహీరాబాద్: వరద ముప్పుకు చెక్ పెట్టేందుకు మున్సిపల్ అధికారులు శ్రీకారం చుట్టారు. వరద, ప్రధాన మురుగు కాలువల్లో పూడికతీత కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. పట్టణంలోని కాల్వల్లో టన్నుల కొద్దిగా పూడిక ను వెలికి తీస్తున్నారు. వర్షాకాలం వస్తుందంటేనే లోతట్టు ప్రాంతాల ప్రజలకు వరద భయం పట్టుకుంటుంది. అయితే, ఈసారి ఆ పరిస్థితి రాకుండా ముందస్తు చర్యలకు మున్సిపల్ యంత్రాంగం నడుం బిగించింది. నగరంలో వరద ముప్పు నుండి శాశ్వత విముక్తి కల్పించేలా, కాల్వల్లో పేరుకుపోయిన పూడికను తొలగించే (డీషీల్టింగ్ ) భారీ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ మహమ్మద్ యూనస్ ఆధ్వర్యంలో కమిషనర్ జీ.ప్రభాకర్ అధికారికంగా శ్రీకారం చుట్టారు.

యుద్ధప్రాతిపదికన పూడికతీత పనులు..

ప్రతి ఏటా వర్షాలు పడగానే డ్రైనేజీలు, ప్రధాన మురుగు కాల్వలు పూడికతో నిండిపోయి, నీరు రోడ్లపైకి చేరడం సర్వసాధారణంగా మారింది. దీన్ని అరికట్టేందుకు ఈసారి అధునాతన యంత్రాలతో పాటు అదనపు సిబ్బందిని రంగంలోకి దించారు. వర్షపు నీరు పారేందుకు చర్యలు తీసుకున్నారు. వర్షాలు ఊపందుకోక ముందే నగరంలోని అన్ని ప్రధాన, ఉప కాల్వలను గుర్తించి క్లీన్ చేయాలని కమిషనర్ ఆదేశించారు. గతంలో ఎక్కడైతే నీరు ఎక్కువగా నిలిచిపోయిందో, ఆయా ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచి, అక్కడ కాల్వల సామర్థ్యాన్ని మరింత పెంచుతున్నారు. పనులు నాణ్యతతో, వేగంగా జరిగేలా మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం అధికారులను పర్యవేక్షకులుగా నియమించారు. ప్రత్యేకంగా డిసాస్టర్ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఫోన్ నెంబర్లు అందుబాటులో ఉంచారు.

ప్రజలకు ఊరట.. కమిషనర్ పిలుపు

మున్సిపల్ కమిషనర్ గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజల భద్రతే తమకు మొదటి ప్రాధాన్యతని పేర్కొన్నారు. ‘వర్షపు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోకుండా నేరుగా ప్రధాన కాల్వల్లోకి వెళ్లేలా ప్రణాళిక సిద్ధం చేశాం. ప్రజలు కూడా కాల్వల్లో ప్లాస్టిక్, చెత్తా చెదారం వేయకుండా మున్సిపల్ యంత్రాంగానికి సహకరించాలని’ మున్సిపల్ కమిషనర్ జీ.ప్రభాకర్ కోరారు. మున్సిపల్ కమిషనర్ తీసుకున్న ఈ ముందస్తు నిర్ణయం పట్ల పట్టణ ప్రజలు, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి వర్షాకాలం వరద భయం లేకుండా సాగిపోతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Next Story