- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అధికార పార్టీ నేత అండ.. ఇష్టారాజ్యాంగా అక్రమ నిర్మాణాలు
కీసరలో అడ్డూ అదుపు లేకుండా నిర్మాణాలు చేపడుతున్న టౌన్ ప్లానింగ్ అధికారులు చోద్యం చూస్తున్నారు.

దిశ, మేడ్చల్ బ్యూరో: ప్రముఖ శ్రీ రామ లింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న కీసర పట్టణం శరవేగంగా అభివృద్ది చెందుతోంది. ఈ తరుణంలో భవన నిర్మాణాల్లో నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కీసర సర్కిల్ పరిధిలో మున్సిపల్ చట్టాలు అమలుకు నోచుకోవడంలేదని స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అక్రమ నిర్మాణదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఎవరైనా అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు చేసినా..,ఇదేంటని ప్రశ్నించినా కీసరలో అధికార పార్టీకి చెందిన ఓ ముఖ్యనేత పేరు చెప్పి బెదిరింపులకు దిగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
నిబంధనల అమలు ఏదీ..?
కీసర సర్కిల్ పరిధిలోని అంకిరెడ్డి పల్లి గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్లు 406,409లలో ఓ పెద్ద ఫంక్షన్ హాల్ ను నిబంధనలకు విరుద్దంగా ,అనుమతులు లేకుండా నిర్మిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా కీసర దాయర లో సర్వే నెంబర్లు 255,172 టీసీఎస్ ఐయాన్ డిజిటల్ జోన్ భవనం పక్కనే పెద్ద షెడ్డును అనుమతులు లేకుండా నిర్మిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్రమ నిర్మాణాల కట్టడికి నిబంధనలు కఠినంగా ఉన్పప్పటికీ అమలు చేసే వ్యవస్థ సరిగా లేకపోతే ప్రయోజనం ఉండదు. ఉల్లంఘనలు జరుగుతున్న సమయంలోనే అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉండగా స్పందించినట్టు అధికారులు లేవు. అధికారులు, రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారనే విమర్శలు ఉన్నాయి. అనధికారికంగా చేపట్టిన కట్టడాలపై అధికార యంత్రాంగం స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఏలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలను గుర్తించి, యాజమానులకు నోటీసులు జారీ చేసి, అవసరమైతే కూల్చివేత చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పర్యవేక్షణ ,కఠిన చర్యలు లేకపోతే అక్రమాల పరంపర కొనసాగుతుందని, మున్సిపల్ ఆదాయానికి పెద్ద మొత్తంలో గండి పడుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
నేతల మధ్య చిచ్చు..
కీసరలో అడ్డూ అదుపు లేకుండా పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. అయితే కొన్ని నిర్మాణాలు.. అధికార పార్టీల నేతల మధ్య చిచ్చురేపుతూ.. అధిపత్య పోరుకు కారణమవుతున్నాయి. ఓ నాయకుడి అండతో అక్రమ నిర్మాణాలు చేపడుతుంటే మరో నాయకుడు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నట్లు సమచారం.అయితే హస్తం పార్టీ నేతల పేర్లు చెప్పి అధికారులు నిర్మాణదారుల నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఇటివల పాత కలెక్టర్ సమీపంలో ఓ అక్రమ నిర్మాణదారుడి నుంచి రూ.లక్షల్లో వసూలు చేసిన అధికారి ఓ అధికార పార్టీ నేతకు ఇచ్చినట్లు సమచారం. దీంతో మరో అధికార పార్టీ నేత సదరు అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. పార్టీ నేతల పేర్లు చెప్పి అక్రమ నిర్మాణదారుల నుంచి వసూళ్లకు పాల్పడితే సహించేది లేదని సదరు అధికారిని హెచ్చరించినట్లు తెలిసింది. నిబంధనలకు విరుద్దంగా కట్టడాలు జరుగుతున్నప్పుడు అధికార పార్టీ నేతలు అండగా నిలుస్తున్నారనే విమర్శలు, విపక్షాలకు ఆయుధంగా మారే అవకాశం ఉంటుందన్న చర్చ నడుస్తోంది. ఇప్పటికైనా మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు అక్రమ కట్డడాలకు అడ్డు కట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయమై కీసర సర్కిల్ డిప్యూటీ కమిషనర్ నాగ లింగంను వివరణ కోరేందుకు ‘దిశ’ ప్రతినిధి సంప్రదించగా, ఆయన కార్యాలయంలో అందుబాటులో లేరు. ఫోన్ చేస్తే లిప్ట్ చేయడం లేదు.






