- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూ.792 కోట్ల ఫాల్కన్ కుంభకోణంలో ఈడీ సంచలనం
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ కేసుల దర్యాప్తు దేశంలోనే తొలిసారిగా ఈడీ ఒక కేసులో సీజ్ చేసిన విమానాన్ని ఈ-వేలం ద్వారా విక్రయించింది.

- దేశంలోనే తొలిసారి...ఈడీ వేలంలోకి విమానం
- రూ.3 కోట్లకు హాకర్ 800A చార్టర్ ఫ్లైట్ విక్రయం
దిశ, తెలంగాణ బ్యూరో: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ కేసుల దర్యాప్తు దేశంలోనే తొలిసారిగా ఈడీ ఒక కేసులో సీజ్ చేసిన విమానాన్ని ఈ-వేలం ద్వారా విక్రయించింది. హైదరాబాద్ జోనల్ కార్యాలయం ఆధ్వర్యంలో దర్యాప్తు సాగుతున్న ఫాల్కన్ గ్రూప్ క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్కామ్‌కు సంబంధించి.. జప్తు చేసిన హాకర్ 800A చార్టర్ విమానాన్ని జూలై 1న ఎంఎస్‌టీసీ లిమిటెడ్ ప్లాట్‌ఫామ్ ద్వారా వేలం వేసింది. ఈ ఆన్‌లైన్ వేలంలో విమానం రూ. 3 కోట్ల ధర పలికినట్లు ఈడీ వెల్లడించింది.
అసలేంటీ ఫాల్కన్ స్కామ్..
ఫాల్కన్ గ్రూప్ సంస్థ ఛైర్మన్ అండ్ ఎండీ అమర్‌దీప్ కుమార్ దేశవ్యాప్తంగా వందలాది మంది అమాయక పెట్టుబడిదారులను నిలువునా ముంచాడు. ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరుతో ఒక భారీ పోంజీ స్కీమ్ నడిపాడు. తమ సంస్థలో పెట్టుబడి పెడితే అతి తక్కువ కాలంలో భారీ లాభాలు ఇస్తామని నమ్మించి సుమారు రూ. 792 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేశాడు. ఈ భారీ కుంభకోణంపై కేసు నమోదు చేసిన ఈడీ.. అమర్‌దీప్ కుమార్ సోదరుడు సందీప్ కుమార్, సంస్థ సీఓఓ ఆర్యన్ సింగ్ చాబ్రా, సీఏ శరద్ చంద్ర తోష్నివాల్ తదితరులను అరెస్టు చేసింది. అయితే ప్రధాన సూత్రధారి అమర్‌దీప్ కుమార్ మాత్రం విదేశాలకు పరారయ్యాడు.
స్కామ్ డబ్బుతో కొని.. శంషాబాద్‌లో సీజ్..
ప్రజలను మోసం చేసి దోచుకున్న డబ్బుతో అమర్‌దీప్ కుమార్ విలాసవంతమైన జీవితం గడిపాడు. ఈ క్రమంలోనే 2024లో అమెరికాకు చెందిన ప్రెస్టీజ్ జెట్స్ ఇన్‌కార్పొరేషన్ సంస్థ నుంచి 1.6 మిలియన్ యూఎస్ డాలర్లు సుమారు రూ. 13 నుంచి 14 కోట్లు వెచ్చించి ఈ హాకర్ 800A రిజిస్ట్రేషన్ N935H చార్టర్ విమానాన్ని కొనుగోలు చేశాడు. ఈ కుంభకోణంపై దర్యాప్తును ముమ్మరం చేసిన హైదరాబాద్ ఈడీ జోనల్ అధికారులు.. 2025, మార్చి 7న హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ విమానం ల్యాండ్ అయిన సమయంలో సోదాలు నిర్వహించి, దానిని సీజ్ చేశారు. అప్పటి నుంచి అది ఎయిర్‌పోర్టులోనే ఉంది.
బాధితులకు ఊరట..వేలం సొమ్ముతో పరిహారం..
సాధారణంగా దర్యాప్తు సంస్థలు సీజ్ చేసిన ఆస్తులు ఏళ్ల తరబడి వృథాగా పడి ఉండి తుప్పు పడుతుంటాయి. ఆస్తుల విలువ పడిపోతుంది. కానీ, ఈడీ ఇప్పుడు ట్రెండ్ మార్చింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం నిబంధనల ప్రకారం.. నేరం ద్వారా సంపాదించిన ఆస్తులను అటాచ్ చేయడం మాత్రమే కాకుండా వాటిని వేలం వేసి ఆ సొమ్మును అసలైన బాధితులకు/పెట్టుబడిదారులకు పరిహారంగా అందించేందుకు కట్టుబడి ఉన్నామని అధికారులు స్పష్టం చేశారు. విమానం విక్రయం ద్వారా వచ్చిన రూ. 3 కోట్లను చట్టపరమైన ప్రక్రియ అనంతరం బాధితులకు పంపిణీ చేయనున్నారు. నేరగాళ్లు ఆర్థిక నేరాల ద్వారా పొందిన ప్రయోజనాలను అనుభవించకుండా అడ్డుకోవడంతో పాటు, బాధితులకు తిరిగి అప్పగించడమే తమ లక్ష్యమని ఈడీ వెల్లడించింది. దేశంలో ఈడీ ఒక విమానాన్ని వేలం వేయడం ఇదే తొలిసారి కావడంతో.. రానున్న రోజుల్లో మనీ లాండరింగ్ కేసుల్లో జప్తు చేసిన ఇతర బినామీ ఆస్తులను కూడా ఇదే తరహాలో వేలం వేసి బాధితులకు న్యాయం చేసే అవకాశం ఉందని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.






